సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. అల్లు అరవింద్ సమర్పణలో.. బన్ని వాసు నిర్మాతగా రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం.
"అరవింద్ గారికి సినిమా గురించి ఓ చిన్న పాయింట్ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చింది. ఆయన సలహా మేరకు పూర్తి కథ సిద్ధం చేసుకొని సినిమా పట్టాలెక్కించాం. ఇందులో దాదాపు 30 మందికి పైగా భారీ తారాగణం నటించింది. నటీనటులంతా ఇది తమ సొంత కథ అన్నట్లుగా ఎంతో ఇష్టపడి చేశారు. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ ఇది. రాశి పాత్ర ప్రతిఒక్కరూ ఇష్టపడేలా ఉంటుంది. నా గత చిత్రాల్లో మాదిరి ఇందులో హీరో పాత్రకి ఎలాంటి లోపాలు లేవు. మేం చెప్పాలనుకున్న సందేశాన్ని క్లాస్ పీకినట్లు కాకుండా ఎంతో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రమిది. పసందైన విందు భోజనంలా ఉంటుంది."
-మారుతి, సినీ దర్శకుడు
2014 తర్వాత గీతా ఆర్ట్స్‌తో కలిసి సినిమా మారుతి చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కోరిక తీరిందని అన్నాడు. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమా విశేషాలను పంచుకున్నాడు.
"ప్రేక్షకులు ఇందులోని పాత్రలకు కనెక్ట్ అవుతారు. మారుతి కథ చెప్పినప్పుడే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చేస్తానా అని ఎదురుచూశా. అంత నచ్చేసింది. సత్యరాజ్ తన పాత్రలో అద్భుతంగా జీవించారు. 'సుప్రీం'లో బెల్లం శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చే పాత్రను ఇందులో చేసింది రాశి. టిక్‌టాక్ సెలబ్రిటీగా ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. శనివారం మూడో పాట విడుదల చేస్తున్నాము."
సాయిధరమ్ తేజ్, సినిమా హీరో
మారుతి సినిమాలో ఓ ప్రత్యేక శైలి ఉంటుందని, సందేశాన్ని కూడా వినోదాత్మకంగా చెప్పే నేర్పు ఉందని అల్లు అరవింద్ అన్నాడు.
"ఈ సినిమా చూసి కొందరు ఎన్నారైలు బాధపడతారు, మరికొందరు ఆనందిస్తారు. విదేశాల్లో ఉండి ఇక్కడి వారికి దూరమైపోతున్న ఎన్నారైలు ఎంత బాధపడిపోతున్నారనేది ఇందులో చూపిస్తున్నాము."
అల్లు అరవింద్, సినీ నిర్మాత
ఇప్పటి వరకు తను చేసిన సినిమాల్లో బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనంటూ హీరోయిన్ రాశిఖన్నా తెలిపింది.
"మారుతి చాలా క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కించారు. టిక్‌టాక్ అంటే పడిచచ్చే యువతిగా నా పాత్ర ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సాయిధరమ్ తేజ్‌తో రెండోసారి పనిచేయడం మర్చిపోలేని జ్ఞాపకం."
రాశి ఖన్నా, సినీ నటి
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరు 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, తమన్, బన్నివాసు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">