తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ సృష్టిస్తున్న విలయతాండవానికి జనం అల్లాడిపోతున్నారు. కరోనా బారిన పడి విషమంగా ఉన్నవారికి ఆస్పత్రుల్లో పడకలు దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్ర బృందం సామాజిక బాధ్యత చాటుకుంది. రాధేశ్యామ్ సినిమా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రి సెట్లోని ఒరిజినల్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, సెలైన్ స్టాండ్లను ఓ ప్రైవేటు ఆస్పత్రికి విరాళంగా అందజేసింది.
నెలన్నర రోజులపాటు ఆ ఆస్పత్రిలో ప్రభాస్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం.. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రీల్ కోసం వేసిన సెట్లోని వస్తువులు రియల్ లైఫ్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి. అయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని వేడుకున్నారు. తన భార్య ఇచ్చిన సలహాతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. దీంతోపాటే ఈ సినిమా కోసం ఆస్పత్రి నిర్మాణం ఎలా సాగిందో వివరించారు.