మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం కథల ఎంపికలో దూకుడు చూపిస్తున్నాడు. ఇది వరకు ఒక్కొక్కటిగా నటించిన ఆయన ఇప్పుడు ఓ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో స్క్రిప్ట్‌ను లాక్ చేసి పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సినిమాలో నటిస్తుండగా.. దాని తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కోసం రామ్ చరణ్ 'లూసిఫర్' రీమేక్ హక్కులను కొని ఉంచారు. ఇదే చిరు 153వ చిత్రమని సమాచారం.
ఈ రీమేక్‌ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నారని నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అవకాశాన్ని యువ దర్శకుడు పరశురాం కొట్టేశాడట. ఈ దర్శకుడు 'గీతాగోవిందం'తో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు. అయితే సుక్కునే ఈ రీమేక్‌కు నో చెప్పాడా? లేక చెర్రీ ఆయన్ను వద్దనుకున్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు.
ప్రస్తుతానికి పరశురాం నాగచైతన్యతో 'నాగేశ్వర్రావు' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. దీన్నిఈ ఏడాదిలో పూర్తి చేసి చిరు చిత్రంలో పాల్గొననున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్థంలో 'లూసిఫర్' రీమేక్ పట్టాలెక్కనుంది. దీనిలో వాస్తవమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: అరే.. అచ్చం సమంతలాగే ఉంది కదా!