హరీశ్ శంకర్... సినిమా సినిమాకీ గ్యాప్ అయితే తీసుకుంటాడు కానీ, ఒక్కసారి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వినోదం పంచుతాడు. మొదటి సినిమా 'షాక్' నుంచి గతేడాది వచ్చిన 'గద్దల కొండ గణేష్' వరకూ అతడు 'ట్రెండ్‌ను ఫాలో కాలేదు... సెట్ చేశాడంతే. 'గబ్బర్ సింగ్'తో పవన్ స్టామినా ఏంటో ప్రేక్షకులకు రుచిచూపించాడు. 2012లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మళ్లీ 8ఏళ్ల తర్వాత మరోసారి పవన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. హరీశ్ శంకర్ కెరీర్‌పై ఓ లుక్వేస్తే చేసిన ఏడు సినిమాల్లో నాలుగు మెగా హీరోలవే కావడం విశేషం. ఇప్పుడు పవన్‌తో మరోసారి కలిసి పనిచేస్తున్నాడు.
రికార్డులు సృష్టించిన గబ్బర్ సింగ్
'జల్సా' తర్వాత పవన్‌కు సరైన హిట్ పడలేదు. ‘పులి’, ‘తీన్‌మార్’, ‘పంజా’ పెద్దగా మెప్పించలేకపోయాయి. ఆ సమయంలో పవన్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు హరీశ్. హిందీలో ఘన విజయం సాధించిన ‘దబంగ్’ కథను మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాడు. ఇక ఐరన్‌లెగ్‌గా ముద్రవేసుకున్న శ్రుతిహాసన్‌ను కథానాయికగా తీసుకుని ఆశ్చర్యపరిచాడు. 'నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్క ఉంది', 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను... సెట్ చేస్తా' వంటి పంచ్ డైలాగ్‌లు, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఓ ఊపుఊపేశాడు. వేసవిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘అంత్యాక్షరి, కెవ్వు కేక ఐటమ్ సాంగ్ యువతను విశేషంగా అలరించాయి.
మెగా మేనల్లుడితో..
మెగా మేనల్లుడు సాయితేజ్‌కి మొదటి కమర్షియల్ హిట్ అందించిన చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. రెజీనా కథానాయికగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా హరీశ్ శంకర్ దీన్ని తెరకెక్కించాడు. ఇందులో చిరు పాట ‘గువ్వా గోరింక రీమిక్స్ యువతను ఆకట్టుకుంది.
‘స్టైలిష్ స్టార్’తో ‘డీజే’ మోగించాడు
అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా విభిన్న పాత్రలో నటించి మెప్పించిన చిత్రం 'డీజే : దువ్వాడ జగన్నాథమ్'. 2017లో వచ్చిన ఈ చిత్రం వెండితెరపై అలరించింది. బన్ని నటన, కామెడీ టైమింగ్, హరీశ్ శంకర్ టేకింగ్, పూజా హెగ్డే అందాలు సినిమాను విజయ పథంలో నడిపాయి. సామాన్యుడిగా ఉంటూ అన్యాయాలను ఎదురించటానికి డీజేగా బన్ని నటన ప్రేక్షకులను మెప్పించిందీ చిత్రం. దేవిశ్రీ పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి.
వరుణ్‌తేజ్‌లో మరో కోణం చూపించాడు
మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ను విభిన్న పాత్రలో చూపించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు హరీశ్ శంకర్. ‘గద్దలకొండ గణేష్’గా వరుణ్‌ను ప్రతినాయక ఛాయలున్న పాత్రలో చూపించి సినీ పరిశ్రమతో పాటు, విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలోనూ అలనాటి సూపర్‌హిట్ పాట ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ రీమిక్స్‌తో అలరించాడు.
‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ రిపీట్
ఇప్పుడు మరోసారి పవన్‌కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు హరీశ్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పవన్ ‘పింక్’ రీమేక్‌తో పాటు, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘పింక్’ దాదాపు పూర్తి కావొచ్చింది. దీని తర్వాత క్రిష్ సినిమా చేస్తాడు. అది అయిన వెంటనే హరీశ్ శంకర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపాడు హరీశ్.
ఆ తర్వాత ‘మెగాస్టార్’తో..
ప్రస్తుతం పవన్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్న హరీశ్ శంకర్ ఆ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించాడు. మరి చిరంజీవిని ఎలా చూపిస్తాడో చూడాలి. రామ్‌చరణ్‌తో సినిమా తీస్తే దాదాపు మెగా హీరోలందరితోనూ హరీశ్ శంకర్ పనిచేసినవాడవుతాడు.
ఇదీ చదవండి: దేవరకొండ సెంటిమెంట్ బ్రేక్ అయిందిగా..!