Oscar awards 2022: ఆస్కార్ గెలుచుకోవడం అంటే సినిమా వాళ్లకు అదో అంతులేని ఆనందం. ఒక్కసారైనా ఆస్కార్ ప్రతిమను ముద్దాడాలని ఎంతగానో తపిస్తుంటారు. ఈసారి జరగనున్న ఆస్కార్ వేడుక కోసం కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఉత్తమ దర్శకుడి రేసులో ప్రముఖ దర్శకులతో పాటు ఓ దర్శకురాలు కూడా పోటీలో నిలిచారు. మరి ఏ కెప్టెన్‌ని ఆస్కార్ వరిస్తుందో అని సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది.
స్టీవెన్ స్పీల్‌బెర్గ్
ప్రపంచ చిత్ర పరిశ్రమ గర్వించే గొప్ప దర్శకుల్లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఒకరు. కమర్షియల్ చిత్రాలతో బాక్సాఫీసుకు వసూళ్ల పంట పండించిన స్పీల్‌బర్గ్ ఇప్పటికే రెండుసార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. తాజాగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ చిత్రానికి నామినేషన్ దక్కించుకున్నారు. న్యూయార్క్ సిటీలోని కొన్ని గ్యాంగ్‌ల మధ్య సాగే పోరు నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ప్రేమ కథను కూడా మేళవించారు స్పీల్‌బెర్గ్. 1957 నాటి స్టేజ్ మ్యూజికల్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాతృకకు తగ్గరీతిలో లేదంటూ కొందరు, బాగుంది అంటూ మరికొందరు సినీ విమర్శకులు రివ్యూలు అందించారు. స్పీల్‌బర్గ్ ముచ్చటగా మూడోసా ఆస్కార్ గెలుచుకుంటారో లేదో చూడాలి మరి.
కెన్నెత్ బ్రనాగ్
‘డెత్ ఎగైన్’, ‘హామ్లెట్’, ‘సిండ్రెల్లా’, ‘మర్డర్ ఇన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’, ‘థోర్’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కెన్నెత్ బ్రనాగ్. ‘బెల్‌ఫాస్ట్’తో ఈసారి ఆస్కార్ ఉత్తమ దర్శకుడి రేసులో నిలబడ్డారు. తొమ్మిదేళ్ల బాలుడి కోణంలో ‘బెల్‌ఫాస్ట్’ కథ సాగుతుంది. కెన్నెత్ తన జీవితంలోని జ్ఞాపకాల్ని కథగా మలిచి తెరకెక్కించిన చిత్రమిది. అనుబంధాలు, భావోద్వేగాలు, కుటుంబ డ్రామా ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు బ్రనాగ్. ఆయన మంచి నటుడు కూడా. ఆయన గతంలో దర్శకత్వం వహించి, నటించిన ‘హెన్రీ వి’కి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ అందుకున్నారు. పలు విభాగాల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు.
పాల్ థామస్ ఆండ్రసన్
ఓ 25 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ల అబ్బాయి మధ్య ఓ ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రం ‘లికోరైస్ పిజ్జా’. ఈ సినిమాతో ఆస్కార్ రేసులోకి వచ్చారు దర్శకుడు పాల్ థామస్ ఆండ్రసన్. 1970ల్లో కాలిఫోర్నియాలోని ఫెర్నాండో వ్యాలీలో జరిగే కథతో ‘లికోరైస్ పిజ్జా’ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు ఆండ్రసన్. ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితుల్ని, చారిత్రక విషయాల్ని చాలా గొప్పగా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాని తనదైన శైలిలో తెరకెక్కించిన ఆండ్రసన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు బ్రిటిష్ అకాడెమీ ఫిల్మ్ పురస్కారాల నామినేషన్లను కూడా దక్కించుకున్నారు ఆండ్రసన్.
జేన్ క్యాంపైన్
ఈసారి ఆస్కార్ రేసులో ఉన్న ఏకైక దర్శకురాలు జేన్ క్యాంపైన్. ‘ది పవర్ ఆఫ్ డాగ్’ చిత్రానికి నామినేషన్ అందుకున్నారామె. న్యూజిల్యాండ్‌కు చెందిన జేన్ గతంలో ‘ది పియానో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నారు. ‘ది పవర్ ఆఫ్ డాగ్’ చిత్రం విభిన్నమైన పాత్రల కలబోతగా సాగుతుంది. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు జేన్. ఇద్దరు అన్నదమ్ముల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫిల్ పాత్ర పోషించిన బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్ ఉత్తమ నటుల రేసులో ఉన్నారు. జేన్‌కు పురస్కారం దక్కితే మరింత మంది మహిళా దర్శకులకు ప్రోత్సాహం లభిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.
హమాగుచి రీయుస్కే
హ్యాపీ అవర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న జపనీస్ దర్శకుడు హమాగుచి రీయుస్కే. ఆయన తెరకెక్కించిన ‘డ్రైవ్ మై కార్’ ఈసారి ఆయనకు ఆస్కార్ నామినేషన్ అందించింది. నటుడు, దర్శకుడు యుసుకే కఫుకు రచయిత్రి అయిన ఓటోతో వివాహం అవుతుంది. కొంత కాలం తర్వాత నటుడు కోజీ తకటుస్కితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఆ విషయం తెలిసినా మౌనంగా ఉండిపోతాడు యుసుకే. కానీ కొన్ని రోజులకు అతడి భార్య మెదడు సంబంధిత వ్యాధితో చనిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడూ యుసుకేకి కోజీ కనిపించడు. భార్య చనిపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతాడు యుసుకే. కొన్ని రోజుల తర్వాత ఓ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వస్తుంది. కానీ చిత్ర నిర్మాణ సంస్థ ఓ షరతు పెడుతుంది. సొంత కారు ఉండాలి కానీ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పడంతో మిసాకీ అనే మహిళా డ్రైవర్ తెరపైకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. భావోద్వేగాల కలబోతతో రోడ్ ట్రిప్ మూవీగా దీన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు హమాగుచి. 2021 కేన్స్ చిత్రోత్సవాల్లో మూడు పురస్కారాలు గెలుచుకుందీ చిత్రం.
ఇదీ చదవండి: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్ మహిళలకు ప్రత్యేక ఆఫర్.. ఏంటంటే?