ఇంగ్లాండ్ నుంచి లగ్జరీ కారు దిగుమతి చేసుకుని పన్ను ఎగవేసిన కేసులో తమిళ హీరో విజయ్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. అతడికి వ్యతిరేకంగా.. రూ. లక్ష జరిమానా కట్టాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై కోర్టు స్టే విధించింది. అలాగే కారు దిగుమతికి సంబంధించి 80 శాతం పన్నును కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెల్లించాలని అతడికి సూచించింది.
2012లో లగ్జరీకారు రోల్స్ రాయిస్ గోస్ట్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నాడు విజయ్. ఈ క్రమంలోనే ఎంట్రీ పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాడు. కానీ ఇందుకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు. అయినా కూడా విజయ్ పన్ను చెల్లించకపోవడం వల్ల అతడిపై కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 13న సింగిల్ జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం తీర్పు వెలువరించారు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేశారంటూ.. విజయ్‌కు రూ. లక్ష జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని రెండు వారాల్లోగా తమిళనాడు సీఎం కరోనా రిలీఫ్ ఫండ్‌లో జమ చేయాలని విజయ్‌ని ఆదేశించారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. పన్నుకట్టడానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ ఆర్ హేమలతతో కూడిన ధర్మాసనం మంగళవారం విజయ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. పూర్తి విచారణ తర్వాత విజయ్‌కు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 80 శాతం పన్నును కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెల్లించాలని విజయ్‌కు సూచించింది.