కరోనా నేపథ్యంలో మూతపడిన థియేటర్లకు మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం వస్తోంది. కొవిడ్ తగ్గుముఖం పడుతుండడం వల్ల థియేటర్లు తెరవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతిచ్చాయి. దీంతో చాలారోజుల తర్వాత వెండితెరపై సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు వచ్చింది. ఫలితంగా తమ తమ చిత్రాల విడుదలకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
గత వారం నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కిరణ్ అబ్బవరం 'ఎస్ఆర్ కల్యాణ మండపం' మంచి వసూళ్లను రాబట్టింది. అభిమానుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో ఈ వారాంతం మరో 9 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో 'చైతన్య', 'రావే నా చెలియా', 'ఒరేయ్ బామ్మర్ది'(డబ్బింగ్), 'ది కంజూరింగ్-3'(డబ్బింగ్), 'సుందరి', 'బ్రాందీ డైరీస్', 'సలాం నమస్తే' శుక్రవారం విడుదలవుతాయి. విశ్వక్ సేన్ 'పాగల్', ఆర్.నారాయణమూర్తి 'రైతన్న'.. థియేటర్లలోకి శనివారం రానున్నాయి.
కొవిడ్ వల్ల పెద్ద సినిమాలు ఓటీటీల వేదికగా విడుదల అవుతుండగా.. చిన్న చిత్రాలు మాత్రం థియేటర్లనే నమ్ముకున్నాయి. విడుదల చేసిన సినిమాలకు సినీ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడం వల్ల సినిమాలు పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇదీ చదవండి: బ్రహ్మానందం నవరసాలు పలికితే!