దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. కచ్చితంగా చెప్పాలంటే లేడీ సూపర్‌స్టార్. ఇండస్ట్రీలో ఇంతలా వెలుగులు చిందిస్తున్న ఈమె.. మీడియాలో కనిపించడం చాలా అరుదు. ఏదైనా చెప్పాల్సి వస్తే, సోషల్ వాల్‌పై సందడి చేస్తుందే తప్ప మీడియాకు ఇంటర్వ్యూలు అస్సలు ఇవ్వదు. ఇలా దూరంగా ఉండటానికి కారణం, ఆమె మనసుకు గతంలో తగిలిన ఓ గాయమేనట. ఈ విషయాన్ని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.
"చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో ఎప్పుడూ మీడియాకు అందుబాటులోనే ఉండేదాన్ని. కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన వాటిని మీడియా వక్రీకరించింది. అది నా మనసును చాలా బాధపెట్టింది. ఆ గాయం కారణంగానే వాళ్లకు దూరంగా ఉంటూ వస్తున్నాను. ఈ పదేళ్లలో ఎవరికీ ఇంటర్వ్యూలు, వీడియో బైట్స్ ఇవ్వలేదు. నటిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడుతుంటాను. ఇండస్ట్రీ అంటేనే మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఈ విషయంలో ఎప్పుడూ సర్దుకుపోలేదు. నా మనసుకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటుంటాను. షూటింగ్స్, కాస్ట్యూమ్, మేకప్.. ఇలా ప్రతి విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలోని వ్యక్తులు నా గురించి ఏమనుకుంటారు? అని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను" -నయనతార, ప్రముఖ కథానాయిక