నటి నయనతార త్వరలో పెళ్లి కబురు వినిపించనుందా? కొవిడ్ పరిస్థితులు కుదుట పడగానే పెళ్లి పీటలెక్కనుందా? అవుననే చెబుతున్నారు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్. నయన్ - విఘ్నేశ్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ తరచూ విహారం కోసం విదేశాలు చుట్టొస్తుంటారు. ఇప్పుడీ ప్రేమ జంట.. వివాహ బంధంతో ఒక్కటి కాబోతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన విఘ్నేశ్.. తమ పెళ్లి విషయపై స్పష్టత ఇచ్చారు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ 'మీరు నయన్‌ను వివాహం చేసుకుంటారని మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఎందుకని మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు' అని ప్రశ్నించారు.
దీనిపై విఘ్నేశ్ స్పందిస్తూ.. "పెళ్లి చేసుకోవడమంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం నేను ఇందు కోసం డబ్బులు దాచి పెడుతున్నా. కొవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత వివాహం చేసుకుంటాం" అని బదులిచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా నయనతారకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.
నయన్ చీరలో ఎంతో అందంగా ఉంటుందని, అందుకే ఆమెను చీరకట్టులో చూడటం తనకెంతో ఇష్టమని తెలియజేశారు విఘ్నేశ్. ఆమె చేసే వంటకాల్లో ఘీ రైస్ చికెన్ కర్రీని ఎంతో ఇష్టపడతానని.. రోజు భోజనం తర్వాత తాము తిన్న గిన్నెలన్నింటినీ ఆమే శుభ్రం చేస్తుందని చెప్పారు. నయన్‌తో కలిసి ఉండే ఏ ప్రాంతమైనా తనకెంతో ప్రత్యేకమని, ఆమెతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటానని తెలియజేశారు.
ఇదీ చూడండి: Nayantara: స్టార్ హీరో చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ!