అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'కర్తవ్యం' పేరుతో విడుదల చేశారు. కలెక్టర్ పాత్ర పోషించిన నయనతారకు ప్రశంసలు లభించాయి. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడటం, ఓ ఊరి సమస్యల్ని తీర్చడం చుట్టూ ఉత్కంఠగా సాగే సినిమా ఇది. దీనికి సీక్వెల్‌గా తీయబోతున్న సినిమాలో నయన్ నటించడం లేదని వార్తలు వచ్చాయి. కాల్‌షీట్స్ కుదరకపోవడం వల్ల ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌ను ఎంచుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. కీర్తి కూడా నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు రాశారు.
తాజాగా ఈ వార్తలపై గోపీ నైనర్ స్పందించారు. సీక్వెల్ తీస్తే.. అది నయన్‌తోనేనని స్పష్టం చేశారు. "వదంతుల్ని ఎవరూ నమ్మొద్దు. నయన్ డేట్స్ ఇవ్వలేదన్న దానిలో నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు. 'కర్తవ్యం 2' వస్తే అది నయనతారతోనే" అని స్పష్టం చేశారు.
నయన్ ఇటీవల 'సైరా నరసింహారెడ్డి', 'దర్బార్' తదితర చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం 'నెట్రికన్', 'కాతువాకుల రెండు కాదల్' సినిమాల్లో నటిస్తున్నారు.