చూస్తే మన పక్కింటి కుర్రాడిలా కనిపించడం ఈ హీరో విజయాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. వెండి తెర అనగానే స్టార్లు, సూపర్ స్టార్లదే హవా అనే భావజాలాన్ని బద్దలు కొట్టి, మనలోని ఒకడు కధానాయకుడిగా ఎదగొచ్చనే విషయాన్ని మరోసారి నిరూపించాడు. ఆ విధంగా స్వయం కృషిని నమ్ముకుని హీరోగా ఎదిగాడు. అతడే నేచురల్ స్టార్ నాని. నేడు (ఫిబ్రవరి 24) 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
పక్కా హైదరాబాదీ
1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించాడు నాని. పాఠశాల విద్యాభ్యాసం సెయింట్ అల్ఫోన్సాస్ హైస్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఎస్.ఆర్.నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, వెస్లీలో డిగ్రీ చదివాడు.
మణిరత్నం స్ఫూర్తి
మణిరత్నం సినిమాల ప్రభావం వల్ల సినిమాలు చూడటం నానికి బాగా అలవాటైంది. మొదట దర్శకుడు కావాలని అనుకున్నాడు. నిర్మాత అనిల్ కుమార్ కోనేరు, నానికి దూరపు బంధువు అవుతారు. అందువలన తన 'రాధా గోపాలం' సినిమాకు క్లాప్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత 'అల్లరి బుల్లోడు', 'ఢీ', 'అస్త్రం' సినిమాలకు తెర వెనుక పనిచేశాడు. స్క్రిప్ట్‌పై వర్క్ చేయడానికి కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకొన్నాడు. నాని స్నేహితురాలు నందిని రెడ్డి అప్పట్లో వరల్డ్ స్పేస్ సాటిలైట్కు రేడియో జాకీగా పనిచేసింది. స్నేహంతో నానికి ఆర్జేగా అవకాశం ఇప్పించింది నందిని రెడ్డి. ఓ సంవత్సరం పాటు 'నాన్ స్టాప్ నాని' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
'అష్టాచమ్మా'తో తెరంగేట్రం
నానిని ఓ ప్రకటనలో చూసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి.. 'అష్టాచమ్మా'లో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్గా నటించింది. 'అష్టా చమ్మా'ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలాగే నాని నటనకు ప్రశంసలు దక్కాయి. నటనాపరంగా మంచి రివ్యూలు దక్కాయి. రెండవ సినిమా 'రైడ్'లో తనీష్, శ్వేతా బసు ప్రసాద్ లతో స్క్రీన్ షేర్ చేసుకొన్నాడు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిందీ చిత్రం. ఆ తర్వాత 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాల్లో నటించాడు.
'అలామొదలైంది' తో సరికొత్త ఊపు
2011లో విడుదలైన సినిమా 'అలామొదలైంది'. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించింది. నిత్యామీనన్ హీరోయిన్. తెలుగులో నిత్యాకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో నాని ప్రదర్శన ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు రాబట్టింది. అలాగే విమర్శకులు అతడి సహజ నటనను మెచ్చుకొన్నారు. పాత్రలో నాని జీవించారంటూ విమర్శకుల ప్రశంసలు లభించాయి. అదే సమయంలో తమిళ్లో 'వెప్పం' అనే సినిమాలో నటించాడు నాని. ఈ చిత్రానికి అతడి స్నేహితురాలు అంజనా దర్శకత్వం వహించింది. ఈ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు నాని. తెలుగులో 'సెగ'గా ఈ సినిమా విడుదలైంది. అయితే రెండు భాషల్లోనూ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఆ ఏడాది నాని చివరి సినిమా 'పిల్ల జమీందార్'. ఇందులో 'అష్టా చెమ్మ'లో తనతో కలిసి నటించిన అవసరాల శ్రీనివాస్ తో మళ్ళీ కలిసి నటించాడు. ఈ సినిమా విమర్శకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రివ్యూలు అందుకోగలిగింది. అలాగే పెర్ఫార్మన్స్ పరంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. పాత్రలో జీవించారంటూ, భావోద్వేగాలు బాగా పండించగలిగారంటూ నానిపై ఎన్నో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచింది . తమిళంలో ఈ సినిమా డబ్ అవడం విశేషం.
రాజమౌళితో ఈగ
ఆ తర్వాత నాని 'ఈగ' సినిమాలో నటించాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో 'నాన్ ఈ' పేరుతో రిలీజ్ అయింది. ఇందులో నాని, సమంత, కన్నడ నటుడు సుదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు. 'ఈగ' సినిమాకు ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో లవర్ బాయ్ గా నాని బ్రహ్మాండమైన నటనని కనబర్చాడు. చిన్న పాత్ర అయినా నాని తన మార్క్ చూపించాడు. హిందీలో, మలయాళంలోనూ ఈ సినిమా విడుదలై విజయాన్ని అందుకుంది.
2012లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమా రిలీజ్ అయింది. ఇందులో 'ఈగ' తర్వాత మళ్ళీ రెండవసారి సమంతతో కలిసి స్క్రీన్‌ని పంచుకొన్నాడు నాని. తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా షూటింగ్ అవడం విశేషం. అయితే, తమిళ్ వెర్షన్ లో నాని పాత్రను జీవ పోషించాడు. తమిళ్ వెర్షన్ లో నాని ఓ అతిథి పాత్రలో నటించాడు. వరుణ్ కృష్ణగా నాని నటన అత్యధిక ప్రశంసలను రాబట్టుకోగలిగింది. కళ్ళతోనే హావభావాలు ప్రదర్శించగలిగాడని అలాగే, వరుణ్ ఆలోచనలన్నీ చిన్న చిన్న మేనరిజమ్ తో పలకించగలిగాడని ప్రశంసలు వచ్చాయి. 'ప్రియతమా నీవచట కుశలమా' పాటలో నాని ఎంతో బాగా నటించాడు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాలో నాని నటన ఆయన ఇప్పటివరకు ఇచ్చిన ఉత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పవచ్చు అని సినిమా విశ్లేషకులు అంటారు.
నిర్మాతగా
'డి ఫర్ దోపిడీ' సినిమాతో నాని నిర్మాతగా మారాడు. ఇందులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, నవీన్ పోలిశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. నాని ఈ సినిమాకు తన స్వరాన్ని ఇచ్చారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా విజయాన్ని అందుకుంది.
2014 సంవత్సరంలో, కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'పైసా' సినిమాలో నటించాడు. సమాజంలో ఉన్న ప్రతీ అంశంపై డబ్బు ప్రభావం ఎలా ఉంటుందో చెప్పే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని పాత్ర పేరు ప్రకాష్. ప్రతికూల సమీక్షలు అందుకున్నప్పటికీ, ఈ సినిమాలోని నాని అభినయం ఎంతో బాగుందంటూ విమర్శకులు ప్రశంసించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.
ఆ తర్వాత యాష్ రాజ్ ఫిలిమ్స్ వారి తొలి దక్షిణ సినిమా 'ఆహ కళ్యాణం'లో నటించాడు నాని. ఇది 2010లో హిందీలో అదే నిర్మాణ సంస్థ నిర్మించిన 'బ్యాండ్ బాజా భారత్' సినిమాకు రీమేక్. తమిళ భాషతో పాటు తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం మిశ్రమ రివ్యూలు అందుకొంది. కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పటికీ ఈ సినిమా నానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2015లో తన కెరీర్లోనే మొదటిసారి 'జండా పై కపిరాజు' అనే పొలిటికల్ థ్రిల్లర్ లో ద్విపాత్రాభినయం చేశాడు. అమలాపాల్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేదు.
ఒకే రోజు రెండు సినిమాలు
'జెండా పై కపిరాజు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలు ఒకే సంవత్సరం ఒకే రోజున రిలీజ్ అవడం విశేషం. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా అత్యధిక పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకోవడంతో పాటు మంచి కమర్షియల్ విజయాన్నీ అందుకొంది. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకోగలిగింది ఈ సినిమా. పరిపూర్ణమైన ఎంటర్టైన్మెంట్ చూడాలనుకునే వారికీ ఈ సినిమా మంచి ఆనందాన్ని ఇస్తుందన్న రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగవ తెలుగు చిత్రంగా నిలిచింది. 'ఈగ' తర్వాత నాని అందుకొన్న రెండవ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ఒక ఫుల్ లెంగ్త్ పాత్రతో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ సినిమాతోనే.
2016లో విడుదలైన నాని సినిమా 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ'. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హను రాఘవపూడి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. మెహ్రీన్ పిర్జాద హీరోయిన్గా నటించింది. నటీనటుల నటన పరంగా ఈ సినిమా ప్రశంసలను అందుకొంది. బాక్సాఫీసు వద్ద బాగానే ఈ సినిమా ఆడింది. అలా 'భలే భలే మొగాడివోయ్' సినిమా ఓపెనింగ్స్ రికార్డు ని బ్రేక్ చేసింది ఈ సినిమా.
ద్విపాత్రాభినయం
2016లో విడుదలైన రెండవ నాని సినిమా 'జెంటిల్ మ్యాన్'. 'అష్టా చెమ్మ' సినిమాతో ఇండస్ట్రీకి నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ మర్డర్ మిస్టరీ థ్రిలర్ గా తెరకెక్కిందీ సినిమా. ఇందులో నాని ద్విపాత్రిభినయం పోషించాడు. సురభి, నివేతా థామస్ హీరోయిన్లుగా నటించారు. అయితే, నివేతాకు పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పాజిటివ్ రివ్యూలతో విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ సినిమాగా నిలిచింది.
2016 ఏడాది చివరిలో విడుదలైన 'మజ్ను'.. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమాను 'ఉయ్యాలా జంపాల' ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేశాడు. ఇందులో నానితో అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ నటించారు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం కాలేదు.
2017లో 'నేను లోకల్'తో ప్రేక్షకులను పలకరించాడు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. విమర్శకుల నుంచి యావరేజ్ రివ్యూలు రాబట్టుకుంది. ఈ సినిమా విజయం అవడంలో నాని పాత్ర ఎంతో ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అత్యధిక వసూళ్లు రాబట్టిన నాని సినిమాలలో ఒకటిగా నిలిచింది.
2017లో విడుదలైన మరో చిత్రం 'నిన్ను కోరి'. ఇందులో నానితో రెండవసారి నివేతా థామస్ నటించింది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాడు. ఈ సినిమా ఒకవైపు విజయాన్ని అందుకున్నా.. లెంగ్త్ పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కొంది.
ఫిదా హీరోయిన్ తో నాని
2017 ఏడాది చివరిలో విడుదలైన సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. 'ఫిదా' ఫేమ్ సాయి పల్లవి ఈ చిత్రంలో నాని సరసన నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. నాని, భూమికల నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
'అ' అనే సినిమాని నిర్మించాడు నాని. కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ తదితరులు నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ని అందుకోగలిగింది.
'కృష్ణార్జున యుద్ధం' అపజయం
నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమా 2018 ఏప్రిల్ 12న విడుదల అయింది. వరుసగా ఎనిమిది సినిమాల విజయం తర్వాత నాని అందుకొన్న మొదటి అపజయం. ఈ సినిమాలో నటన పరంగా నానికి ప్రశంసలు దక్కాయి. 2018 జూన్ లో నాని రియాలిటీషో 'బిగ్ బాస్ తెలుగు 2' సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత 'దేవదాస్' సినిమా విడుదలైంది. కామెడీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని ఓ వైద్యుడి పాత్రలో నటించాడు. ఇందులో అక్కినేని నాగార్జున డాన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాకు అనేక ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
'జెర్సీ' 2019లో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు సంపాదించుకొన్న ఈ సినిమా ఫీల్ గుడ్ హిట్ గా నిలిచింది. అలాగే బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. 2019లోనే విడుదలైన మరొక నాని సినిమా 'గ్యాంగ్ లీడర్'. ఇది 2019 సెప్టెంబర్ 13న రిలీజ్ అయింది. ఇది మిశ్రమ సమీక్షలు రాబట్టుకోగలిగింది.
నాని సినిమాలు
'అష్టాచెమ్మ', 'రైడ్', 'స్నేహితుడా', 'భీమిలి కబడ్డీ జట్టు', 'అలా మొదలైంది', 'పిల్ల జమీందార్', 'ఈగ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'డి ఫర్ దోపిడీ', 'పైసా', 'జండాపై కపిరాజు', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'భలే భలే మొగాడివోయ్', 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ', 'జెంటిల్ మ్యాన్', 'మజ్ను', 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', 'వి' సినిమాలలో ఇప్పటి వరకు నటించాడు. 'జ్యో అచ్యుతానంద', 'నీవవేరో' సినిమాలలో అతిధి పాత్రల్లో తెరపై కనువిందు చేశాడు. ప్రస్తుతం 'టక్ జగదీశ్', 'శ్యామ్‌సింగ రాయ్' సినిమాలతో బిజీగా ఉన్నాడీ నేచురల్ స్టార్.
వివాహం
అంజనా యలవర్తితో నానికి 2012 ఆగష్టు 12న నిశ్చితార్ధం జరిగింది. అదే సంవత్సరం అక్టోబర్ 27న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
పురస్కారాలు
'ఈగ' సినిమాకు రైజింగ్ మేల్ హీరో విభాగంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నుంచి ఒక పురస్కారం లభించింది. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాకు ఉత్తమ నటుడి విభాగంలో ఓ నంది పురస్కారం దక్కింది. 'భలే భలే మొగాడివోయ్' సినిమాకు ఉత్తమ విమర్శకుల నటుడి విభాగంలో ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాకు జీ సినిమాలు అవార్డ్స్ 2017లో బాయ్ నెక్స్ట్డోర్ విభాగంలో అవార్డును అందుకున్నాడు నాని. అదే సినిమాకు అదే అవార్డ్స్ నుంచి గోల్డెన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకొన్నారు. 'జెంటిల్ మ్యాన్' సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ పాపులర్ ఛాయస్ విభాగంలో టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి ఓ పురస్కారం అందుకొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: నాని సందడి షురూ.. అలరిస్తున్న 'టక్ జగదీష్' టీజర్