మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections) అధ్యక్ష ఎన్నికల్లో వేడి రాజుకుంటోంది. అధ్యక్ష పదవికి బరిలో దిగిన ప్రకాశ్ రాజ్(Prakash Raj), మంచు విష్ణు(Manchu Vishnu), జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar)లు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ నటీనటుల మద్దతు కూడగట్టుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే చిరంజీవి మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో మా ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం 'మా'లో కార్యదర్శిగా పనిచేస్తున్న జీవిత రాజశేఖర్ అధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. తానూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 'మా' ఎన్నికలను చిరంజీవి, మోహన్ బాబు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. జీవిత రాజశేఖర్ పోటీలోకి దిగడం వల్ల సినీ పరిశ్రమలో అంచనాలు మారిపోయాయి.
అయితే జీవిత రాజశేఖర్‌కు నందమూరి బాలకృష్ణ మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య మద్దతుతో జీవిత 'మా' అధ్యక్ష పదవిని సునాయాసంగా కైవసం చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిరంజీవి మద్దతుదారులంతా ప్రకాశ్ రాజ్ వైపు మొగ్గు చూపుతుండగా.. మోహన్ బాబు మాత్రం కుమారుడిని గెలిపించుకునేందుకు సీనియర్ నటీనటులతో మంతనాలు సాగిస్తున్నారు.
నాగార్జున మద్దతు
అగ్రనటుల్లో మరో నటుడు నాగార్జున మద్దతు కూడా చిరంజీవి జట్టువైపే ఉంటుందని చర్చించుకుంటున్నారు. దీంతో ఒక్కటిగా కలిసుందామని పిలుపునిచ్చే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అధ్యక్ష ఎన్నికలు సినీపరిశ్రమను మరోసారి మూడు వర్గాలుగా చీల్చబోతున్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా జీవిత రాజశేఖర్ వైపు బాలయ్య దృష్టి సారించడం వల్ల ఈసారి 'మా' ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదని అసోసియేషన్‌లోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్ష పోరులో మరో మహిళ
ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయనటి హేమ కూడా 'మా' అధ్యక్ష పదవికి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గతంలో మా అసోసియేషన్ లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పనిచేసిన హేమ.. మహిళ నటీమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
అసోసియేషన్ ఏంటంటే?
926 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికి 26 ఏళ్లవుతుంది. తొలిసారిగా ఈ అసోసియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేయగా ఆ తర్వాత కాలంలో సీనియర్ నటులు మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్ పనిచేశారు.
రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీతో రసవత్తరంగా మారి సాధారణ ఎన్నికలను తలపించిన మా అసోసియేషన్ ఎన్నికలు.. ఆ తర్వాత పాలకవర్గం సీనియర్ నటులు నరేశ్, శివాజీ రాజాలతో తారస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో నరేశ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈ దఫా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయనుండటం వల్ల ముచ్చటగా మూడోసారి రసవత్తరంగా మారనున్నాయి.
ఇదీ చూడండి.. Chiranjeevi X Mohan Babu: రసవత్తరంగా 'మా' అధ్యక్ష పోరు!