"వ్యక్తిగతంగా నాకెలాంటి ఇష్టాలున్నప్పటికీ.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథల్ని ఎంపిక చేసుకోవాలి. వ్యక్తిగత ఇష్టాలు, ప్రేక్షకుల అభిరుచులు... ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలోనే నా ప్రతిభ ఏంటన్నది బయట పడుతుంది" అని చెప్పాడు హీరో నాగచైతన్య. మామ వెంకటేశ్‌తో కలిసి నటించిన 'వెంకీమామ'.. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడాడు. ఆ విషయాలివే.
"గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా... అని సినిమాలో మీ గురించి మీ 'వెంకీమామ' డైలాగ్ చెప్పారు. మరి నిజ జీవితంలో మీ మామల నుంచి నేర్చుకున్న విషయాలేంటి?
సురేశ్ మామ నుంచి కెమెరా వెనకాల విషయాలు నేర్చుకున్నా, వెంకీమామ దగ్గర కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకున్నా. సురేశ్ మామకు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మంచి పరిజ్ఞానం ఉంటుంది. ఆయన్ని చూస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నా. వెంకీమామ దగ్గర వ్యక్తిగా ఎలా ఉండాలో నేర్చుకున్నా. సెట్స్‌లో ఆయన నడుచుకునే విధానం చాలా బాగుంటుంది. నిశ్శబ్దంగా, సంతోషంగా, పాజిటివిటీతో కనిపిస్తుంటారు. ఆయన్ని ద్వేషించేవాళ్లు ఎవ్వరూ ఉండరు. అదెందుకో ఈ సినిమా చేస్తూ ఇంకా బాగా తెలుసుకున్నా. ఇక నటుడిగా అంటారా? ఆయనతో కలిసి కామెడీ చేయడమనేది ఏ నటుడికైనా ఓ వరం. భావోద్వేగాల పరంగానూ ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా.
'వెంకీమామ' సెట్స్‌లో మామయ్యలు కోపగించుకోవడం చూశానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు?
వాళ్లకి ఊరికే కోపం ఎప్పుడూ రాదు. సురేశ్ మామైనా, వెంకీ మామైనా ముందు ప్లాన్ చేసింది జరగకపోతే ఒప్పుకోరు. ఆ క్షణంలోనే వాళ్లు కోప్పడిపోతారు. ఆ కోపం మంచిదేనండి. అంకిత భావం, సమర్థత నుంచే అలాంటి కోపం వస్తుంటుంది.
నిజ జీవితంలో మామా అల్లుడైన మీరు, వెంకటేశ్... అవే పాత్రల్లో నటించడం మరింత సులభమైందనుకోవచ్చా?
అంత సులభంగా అయితే అనిపించలేదండీ. వెంకీమామైనా, నేనైనా నిజ జీవితంలో చాలా రిజర్వ్‌గా ఉంటాం. ఎక్కువగా మాట్లాడుకోం. నిశ్శబ్దంలోనే ఒకరిపై ఒకరికున్న ప్రేమ కనిపిస్తుంటుంది. సినిమాకు వచ్చేసరికి బోలెడన్ని డైలాగులు చెప్పడం సహా.. ఫుల్ ఎనర్జీతో కనిపించాల్సి ఉంటుంది. అది కొత్తగా అనిపించింది. నాకైతే పది రోజులు కష్టంగానే ఉంది. 30 ఏళ్లు ఇంట్లో ఓ రకంగా పెరిగాను. మామపై ఒక ప్రత్యేకమైన గౌరవంతో చాలా క్రమశిక్షణతో మెలిగాను. సెట్స్‌పైకి వచ్చేసరికి అందుకు భిన్నంగా చేయాల్సి వచ్చింది. పైగా ఆయన ముందు తప్పు చేయకూడదు, అంతా కరెక్ట్ చేయాలనే ఒక భయం ఉంటుంది కాబట్టి సమయం పట్టింది.
'వెంకీమామ'లో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
మామా అల్లుళ్ల మధ్య త్యాగం అనే ఒక అంశం ఉంటుంది. దానికి బాగా కనెక్ట్ అయ్యా. దీనితో పాటే ఈ సినిమాలో వినోదం బలంగా ఉంటుంది. కుటుంబ బంధాల మధ్య ఒక ప్రేమ, ఎలాంటి అంచనాలు లేకుండానే త్యాగం చేయడం వంటి అంశాల్ని ఇప్పటివరకు ఏ సినిమాలో చూడలేదనిపించింది. ఇలాంటి పాత్రల్లో రియల్ లైఫ్ మామా అల్లుళ్లు చేస్తే ప్రేక్షకులకు ఇంకా నచ్చుతుందని నా అభిప్రాయం.
ఇందులో మీరు మాస్ పాత్రలో కనిపించారనుకోవచ్చా?
అంటే అదొక కొత్త రకమైన మాస్ అని చెబుతాను. మిలటరీ ఆర్మీ ఎపిసోడ్‌ను నేనెప్పుడూ ఏ సినిమాలోనూ టచ్ చేయలేదు. కొత్త స్టైల్ హీరోయిజం, కొత్త స్టైల్ కమర్షియాలిటీ ఇందులో ఉంటుంది. ఈ కథలో నాకు బాగా నచ్చిన మరో విషయం అది.
మిలటరీ అధికారి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
సురేశ్ ప్రొడక్షన్స్‌లో సమయం ఎక్కువగా దొరుకుతుంది. ఈ సినిమాకు సిద్ధం కావడానికి నాకు ఓ ఏడాది సమయం దొరికింది. ఆ క్రమంలో నిజమైన ఆర్మీ అధికారుల్ని చాలామందిని కలిశాం. కశ్మీర్‌కు వెళ్లి అక్కడి కంటోన్మెంట్ ఏరియాల్లో సినిమా చేశాం. అదొక మంచి అనుభూతి. నాకు చాలా విషయాలు తెలిశాయి. అక్కడ జరిగిన చిత్రీకరణను బాగా ఆస్వాదించా. చిత్రబృందం మాత్రం చాలా కష్టపడింది.
వెంకటేశ్, మీరు కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆలస్యమైందని భావిస్తున్నారా?
అది మనసులో ఎప్పట్నుంచో ఉన్న విషయమే. అయితే నటుడిగా ఇంకా అనుభవం వచ్చాక అదే సెట్ అవుతుందని అనుకున్నా. దాంతో ఎక్కువగా ఆలోచించలేదు. అయితే సురేశ్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. తొలి చిత్రం అది కలగానే ఉండిపోయింది. అయితే ఈ రెండూ ఈ ఏడాదిలోనే కలిసొచ్చాయి. గతేడాది ఒకసారి సురేశ్మామ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అంతకుముందు ఆయన 10-20 కథల్ని నా దగ్గరికి పంపించారు. కానీ ఏదీ సెట్ కాలేదు. చివరికి ఇది కుదిరింది.
మీరు 'వెంకీమామ'ను మల్టీస్టారర్‌గానే భావించారా లేక మరో కథగానే చూశారా?
వెంకటేశ్ పక్కన ఓ పాత్ర చేశానంతే. అంతే తప్ప నేనైతే మల్టీస్టారర్‌గా చూడలేదు. నేను ఆయన అభిమానిని. ఆయనపై గొప్ప గౌరవం ఉంది. ఈ సినిమా ప్రయాణంలో ఆయన పక్కన ఒక పాత్ర చేశాననే అనుభూతి కలిగింది. నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుందీ చిత్రం.
కొత్త కథల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
రియలిస్టిక్ కథల్నే ఇష్టపడతా. ఇటీవలే కొత్త దర్శకుల కంటే, అనుభవమున్న దర్శకులతో సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాను. కొత్తతరం మంచి కథలతో వస్తున్నారు. నేను కొన్ని చేశాను, కానీ అవి సరైన ఫలితాన్నివ్వలేదు. అలాగని కొత్తవాళ్లపై నమ్మకం లేదని కాదు. వాళ్లతో పోలిస్తే నేను సీనియర్‌గా కనిపిస్తుంటా. వాళ్లు నాతో పనిచేసేటప్పుడు మొహమాటం కొద్దీ నాతో పరిమితంగా పనిచేయించుకుంటారు. దర్శకుల నటుడిని నేను. వాళ్లు ఎంత చెబితే అంతే చేస్తుంటా. అనుభవమున్న దర్శకులైతే మొహమాటం లేకుండా నా నుంచి రాబట్టుకుంటారు కాబట్టి వాళ్లతోనే పనిచేస్తున్నా. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. అదొక అందమైన ప్రేమకథ. అది తప్ప కొత్త సినిమాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">