అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ముంబయి మెజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. పోర్నోగ్రఫీకి సంబంధించి ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ముంబయి నేర విభాగం పోలీసులు.. ఈనెల 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. వెబ్ సిరీస్‌లో అవకాశాల పేరుతో పోర్న్ చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేసినట్లు కుంద్రా అరెస్ట్ తర్వాత కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారంరోజుల పాటు కుంద్రాను ప్రశ్నించిన పోలీసులు ఈనెల 27తో పోలీసు కస్టడీ ముగియడం వల్ల కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ రాజ్‌కుంద్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పిన జస్టిస్ A.S.గడ్కరీ.. తన అరెస్ట్ అక్రమమంటూ రాజ్‌కుంద్రా వేసిన పిటిషన్‌పై ఈనెల 29లోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.
శిల్పాశెట్టికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఈ అశ్లీల చిత్రాల కేసుతో ప్రమేయం లేదనే విషయం ఇంకా తేలాల్సి ఉందని ముంబయి నేర విభాగం పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జుహులోని శిల్పాశెట్టి నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకోవటం సహా శిల్పాశెట్టి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రాతో శిల్పాశెట్టి గొడవపడినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. భర్తతో వాదులాడుతూ కన్నీరుపెట్టుకున్న బాలీవుడ్ నటిని పోలీసులే ఓదార్చినట్లు పేర్కొన్నాయి. అశ్లీల చిత్రాల కేసులో భర్త రాజ్‌కుంద్రా ప్రమేయం గురించి తనకు ఏమాత్రం తెలియదని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
రాజ్‌కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్‌లో శిల్పాశెట్టి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ పదవి నుంచి ఆమె తప్పుకున్నారు. ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం బయటపడుతుందని తెలిసే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకే శిల్పాశెట్టికి ఇంకా క్లీన్‌చిట్ ఇవ్వలేదని ముంబయి నేరవిభాగం పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి.. 'శిల్పాశెట్టికి క్లీన్ చిట్ రాలేదు.. విచారణ కొనసాగుతోంది'