ఆయన పాట పంచామృతం. మనసు తాకే మధుర తుషారం. మోహనం. సమ్మోహన రాగ సరాగం. మధువనాలను మళ్లీ మళ్లీ పూయించిన పాటల తోటమాలి. సప్త స్వరమాలి. వైవిధ్య బాణీల మాంత్రికుడు. గోదావరి తీరాన ప్రవహించిన రసఝరి. ఆ గానామృతం ఎంతో రుచి. మూసబాణీలతో విసిగి మాధుర్యగీతాలకు వేచివున్న శ్రోతలకు..సమయానికి తగుబాణీలిచ్చి రసడోలికల్లో ఓలలాండిచిన ఆయన మరకతమణి కీరవాణి. ఆ సంగీతం పెరటి జాంపండులా తీయగా, సీతారామయ్యగారి మనవరాలి వాయులీనంలా హృద్యంగా, పెళ్లి సందడిలో సన్నాయి పాటలా ఉంటుంది.
వేలాది గీతాలు అతడి స్వరాల పల్లకిలో విహరిస్తూ పరిమళభరితంగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. హుషారైన వయసులో జీవన సంధ్యకు చేరిన విషాద మల్లిక మోమున నవ్వులు పూయించిన బాణీలు (ట్యూన్స్) అవి. నాటకాల జగతిలో జ్ఞాపకాల జావళి అంటూ జీవనవేదాంతాన్ని అక్షరీకరించిన పాట అయినా, లాలూదర్వాజ లష్కరు అనే హుషారుగా రాసిన పాటకయినా కీరవాణి అద్దిన సంగీతం గుర్తుండిపోతుంది.
నిప్పులా కాలే మనసుకు మంట శబ్దం కావాలి. ఏ అకాస్టిక్సో తెలియదు. 'అంతం' సినిమాలో (ఈ ఒక్కపాటకే సంగీతం అందించారు) 'గుండెల్లో దడదడ' అనే పాటకు కీరవాణి ఓ ఎఫెక్ట్‌ను అద్భుతంగా పలికించారు. శృంగార గీతాలకు భువనచంద్ర ఒక బ్రాండు. 'అల్లరి ప్రియుడు'లో ఆయన రాసిన 'కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను' గీతానికి కీరవాణి సంగీతం అద్భుతం.
'పుణ్యభూమి నాదేశం' ఎన్టీఆర్‌కు చివరి పాట. దీనికి తారస్థాయి సంగీత బాణీలు సమకూర్చారు కీరవాణి. 'ఇది రాయలసీమ గడ్డ' అని ఎన్టీఆర్ తనయుడికి' సీతయ్య'లో ఓ పాట. 'పెళ్లిసందడి' చేసిన నవమన్మధుడు కీరవాణి బాణీల్లో ఒదిగిపోయారు. కీరవాణి పాట తెలుగు ఇంటి పెరటిలో మందారం.
'అన్నమయ్య'లో 'ఏలే ఏలే మరదలా'! వేల పాటల్లో పది ఏరికోరమంటే ఎలా? ఆ మధురగీతాలు చెవులు రిక్కించి వినటానికి 'వల్లంకి పిట్ట' మెల్లంగ వస్తుంది. 'శ్రీరామదాసు'లో 'ఎంతో రుచిరా', 'శిరిడి సాయి'..'సాయికథా చరితం సకలపాపహరణం'..మనసుదోచే బాణీలు. తెలుగుసినీ సంగీతంలో కీరవాణి ఒక చరిత్ర.. ఒక ఆటోగ్రాఫ్. స్వీట్ మెమొరీ.
'నల్లా నల్లాని కళ్ల పిల్లా'.. పాట మరో జోరుపాట. 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి'..అందరి జ్ఞాపకాల రీలును తిప్పినగీతం. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' రీరికార్డింగ్‌కు ప్రశంసలు వచ్చాయి.
'రబ్బరుగాజులు, రిబ్బనుపూవులు', 'పంచదారబొమ్మ, బొమ్మ' ఎన్నో గీతాలు.గీతగుచ్ఛాలు. కీరవాణి సంగీతానికి ఆంధ్రదేశం దోసిలిపట్టింది. తనివితీరా ఆస్వాదించింది. 'బాహుబలి' మూవీకి సంగీత ప్రాధాన్యం లేకున్నా కొద్దిగీతాలతో మళ్లీ చెరగని ముద్రవేశారు కీరవాణి.
అవార్డులు దాసోహం..
'అన్నమయ్య' చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు కీరవాణి. 'రాజేశ్వరి కళ్యాణం', 'అల్లరి ప్రియుడు', 'పెళ్ళి సందడి', 'ఒకటో నెంబర్ కుర్రాడు', 'ఛత్రపతి', 'వెంగమాంబ', 'ఈగ', 'బాహుబలి' చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాల్ని దక్కించుకున్నారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా అందుకున్న ఘనకీర్తి పొందిన వ్యక్తి కీరవాణి.