బాలీవుడ్లో ఎన్నో హిట్ పాటలను పాడిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంగీత పరిశ్రమ నుంచి ఆత్మహత్య వార్తలను వినే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన సోనూ.. చిత్ర పరిశ్రమ కంటే.. సంగీత పరిశ్రమలో మాఫియాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఇందులో ఎవరు పాడాలి, ఎవరు పాడకూడదు అనే విషయాలను రెండు కంపెనీలు మాత్రమే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. యువ ఔత్సాహిక గాయకులు, గేయ రచయితలు, స్వరకర్తల జీవితాలను ఈ మ్యూజిక్ మాఫియా నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కొత్త గాయకులు, గేయ రచయితలు, కంపోజర్లు, తదితర కళాకారుల గొంతులో నేను నిరాశను చూశా. ఒకవేళ వారు చనిపోతే, అందరి చూపుడు వేళ్లు మీ వైపే చూపిస్తాయి. నాకు జరిగింది చాలు. దయచేసి యువ కళాకారుల మనసును హింసించొద్దు. వారి కళ్లలో కన్నీటికి బదులు రక్తాన్ని కార్చేలా చేయద్దు. ఇది మంచి పద్ధతి కాదు. వేల కలలు కంటున్న ఆ యువకులకు సాయంగా నిలబడండి. వారికి మీ సాయం, ధైర్యం అవసరం."
-సోనూ నిగమ్, బాలీవుడ్ సింగర్
పేరు ప్రస్తావించకుండా ఓ సూపర్ స్టార్ అనైతిక కార్యకలాపాల గురించి మాట్లాడాడు సోను. "నాకు తెలుకు ఆ నటుడు ఎవరనేది. ప్రస్తుతం అతను ఫోకస్లో ఉన్నాడు. నేను పని కావాలని ఎప్పుడూ అడగను. కానీ వారు నన్ను పిలుస్తారు. పాటను రికార్డు చేసి.. వాటిని డబ్ చేస్తారు. ఇది చాలా తమాషాగా ఉంది కదా?. నేనే కాదు, అర్జిత్ సింగ్కు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఊహించుకోండి.. 1989 నుంచి ఈ ఇండస్ట్రీలో ఈ విధమైన చర్యలుంటే.. కొత్త ప్రతిభ ఎలా బయటకు వస్తుంది." అంటూ వివరించారు.
దర్శకులు, నిర్మాతలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎందుకంటే వారికి నచ్చిన సంగీతాన్ని ఎంచుకునే అనుమతి వారికి లేదు. 'మ్యూజిక్ కంపెనీల డిమాండ్ మేరకే అంతా జరగాలి' అని నాతో వారు చెబుతూ వాపోయిన సందర్భాలున్నాయి.
-సోనూ నిగమ్, బాలీవుడ్ సింగర్
ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకాల మరణం బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సోను వ్యాఖ్యలు.. సినీ పరిశ్రమలో మాఫియా గురించి మరింత స్పష్టతనిస్తున్నాయి .
ఇదీ చూడండి: