మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కేరళలోని పాలక్కడ్ పరిధిలోని వరిక్కసేరి ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్లిన ఆయన... అక్కడి చిన్నారులు, విద్యార్థులతో మాట్లాడి, అనంతరం బహుమతులు అందజేశాడు. అదే ప్రాంతంలో ఐదేళ్లుగా మమ్ముట్టి కేర్ అండ్ షేర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై ఆరా తీశాడు.
నెల్లియంపతి అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఈ సంస్థలు ఏర్పాటు చేశారు. విద్య, వైద్య సదుపాయం, పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు, అత్యాధునిక వైద్య పరికరాల నిర్వహణపై ప్రజలతో చర్చించాడు మమ్ముట్టి. సమస్యలు, వాటి పరిష్కారాలపై అక్కడి వారితో మాట్లాడాడు. ఆదివాసీ విద్యార్థులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పాడు. అదే విధంగా షూటింగ్ చూసేందుకు స్థానికులకు అవకాశం కల్పించాడు.
తెలుగులో 'స్వాతికిరణం', 'సూర్యపుత్రులు' సినిమాల్లో నటించాడు మమ్ముట్టి. ఇటీవలే 'యాత్ర' బయోపిక్‌తో మరింత పేరుతెచ్చుకున్నాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'మమంగం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఇదీ చదవండి...బల్గేరియాలో 'ఆర్ఆర్ఆర్'.. రాజమౌళి ఫొటో వైరల్