శివసేన పార్టీపై నటి కంగనా రనౌత్ విమర్శల దాడి కొనసాగుతుంది. అలాగే శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిందంటూ ట్వీట్ చేసింది కంగన. ఈ క్రమంలో మహా ప్రభుత్వం డ్రగ్స్ వాడకంపై కంగనపై విచారణకు ఆదేశించింది. దీంతో కంగన సోనియా గాంధీని టార్గెట్ చేసింది. మహిళలపై వేధింపులకు అడ్డుకట్టవేయాలని సోనియాను కోరింది.
తాజాగా కంగన డ్రగ్స్ వాడిందన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఆమెపై దర్యాప్తునకు సంబంధించిన అనుమతి పత్రాలు పోలీసు శాఖకు అందినట్లు ఓ అధికారు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ విషయాన్ని పరిశీలిస్తుందని వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విషయమై ముంబయి పోలీసుల పనితీరు బాగాలేదని ఆరోపించింది కంగన. అప్పటి నుంచి కంగన, శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సోనియాను సూటిగా ప్రశ్నించిందీ హీరోయిన్.
"గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారు.. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వం నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఓ మహిళగా మీకు బాధగా అనిపించడం లేదా? రాజ్యాంగ సృష్టికర్త బి.ఆర్.అంబేడ్కర్ మనకిచ్చిన రాజ్యాంగ నియమాలను పాటించమని మీ ప్రభుత్వానికి చెప్పలేరా? పశ్చిమ దేశాల్లో పుట్టి.. భారత్‌లో నివసిస్తున్న మీకు మహిళల పోరాటాల గురించి బాగా తెలిసే ఉంటుంది. మీ ప్రభుత్వం మహిళలను వేధిస్తూ.. చట్టాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటికైనా మీరు కలుగజేసుకుంటారని ఆశిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చింది.