సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కలాన్ని హలంగా చేసి తెలుగు చిత్రసీమలో పరిమళాల పాటలు పండించిన వాడు..
అలతి అలతి పదాలతో అందమైన బాణీలు కట్టి సినీ పాటల పూదోటలో సిరివెన్నెలలు కురిపించిన వాడు..
"లాలి జో లాలి జో" అంటూ... అమ్మ ప్రేమకు తన కలంతో హారతి పట్టినా..
"నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని" అంటూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్న సమాజాన్ని నిలదీసినా..
"నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా" అంటూ.. యువతరానికి జీవిత పాఠాలు నేర్పినా.. అది సిరివెన్నెల కలం కురిపించిన సాహిత్యపు జల్లే అవుతుంది.
"శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ.." అంటూ మురిసిన మధుర భక్తుడాయన
"జగమంతా కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాదీ" అని చెప్పిన అద్భుతమైన సాహిత్యకారుడు..
చిత్రసీమను తన పాటల పూదోటలో విహరింపజేసిన సరస్వతి మాత ముద్దుబిడ్డ సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. నేడు(మే 20) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని మరిన్ని పదనిసలు..
"విధాత తలపున ప్రభవించినది.." సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవ్వడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను, జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతమంటే ప్రతి ఇంటా అదొక సుప్రభాత సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించని ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అదీ సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటల పూదండలు కట్టి తెలుగుభాషకు నీరాజనాలందించిన వాడు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.
"భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ"...అంటూ కాలేజీ యువకుడిగా సందడి చేసినా, "జాణవులే నెర జాణవులే..." అంటూ పడుచుపిల్లతో మెలోడీ ఆటలాడించినా సిరివెన్నెలకే సొంతం. అక్షరాలను ఆయుధాలుగా "నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని" అంటూ సమాజానికి పట్టిన నిర్లక్ష్యపు నిద్రమత్తును వదిలించిన వాడు ఆయన. మెలోడీ, క్లాస్, మాస్, రాక్, రాప్, అచ్చతెనుగు సంప్రదాయ గీతం ఇలా పాట ఏదైనా సిరివెన్నెల చేతిలో పడితే వెండితెరపై పండువెన్నెలు కురిపించాల్సిందే. అదే ఆయన ప్రత్యేకత.
తన 34ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల. అమ్మగా, ప్రేయసిగా, ప్రియుడిగా, భర్తగా, భార్యగా, మహా భక్తుడిగా, సాహితీ విమర్శకుడిగా, పోరాట యోధుడిగా.. పాట పాటకూ తన ఆలోచనా రూపాన్ని కలం పదును పెంచుకొని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్యస్థాయిని పెంచిన నిత్యకృషీవలుడు. శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల తర్వాత అనేక అవార్డులు అందుకున్న అద్వితీయ రచయిత.
15 రోజులు పట్టింది
సిరివెన్నెల సీతారామశాస్త్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అసలు పేరు సీతారామాశాస్త్రి మాత్రమే. ఆయన తొలిసారిగా పాటలు రాసిన చిత్రం 'సిరివెన్నెల'. ఆ పాటలన్నీ సినీప్రియులను అలరించడం వల్ల ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మారిపోయింది. అలా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశం దొరికితే ప్రజలను ప్రశ్నించడం, వారికి ఓ సందేశమిచ్చేలా, స్ఫూర్తిని నింపేలా పాటలు రాయడం ఆయనకు కలంతో పెట్టిన విద్య. తను రాసే గీతం కోసం రోజుల తరబడైనా కష్టించడానికి వెనుకాడని సాహిత్యాభిమాని సిరివెన్నెల. "శివపూజకు చిగురించిన సిరి సిరి మువ్వా" అంటూ భక్తుడిలా రాసిన పాటకు 15 రోజులు పట్టిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదీ చూడండి.. ఆ వయసులోనే 'సీత'కు తారక్ లవ్ లెటర్!