కలాన్ని హలంగా చేసి తెలుగు చిత్రసీమలో పరిమళాల పాటలు పండించిన రచయిత రామజోగయ్య శాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన గీతాలు ఎన్ని సార్లు విన్నా కొత్తగానే విన్నట్లు అనిపిస్తుంది. 'ప్రేమ దేశం యువరాణి.. పూతప్రాయం విరిబోణి..' అంటూ కథానాయికను కీర్తించినా.. 'సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడూ..' అంటూ హీరోయిజాన్ని ఆవిష్కరించినా.. 'హే సక్కూ బాయ్.. జరా దేదోనా గరమ్ ఛాయ్..' పాటకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చినా అది రామజోగయ్య శాస్త్రికే చెల్లింది. 'యువసేన' నుంచి మొదలుపెడితే ఆయన నుంచి ప్రతిసారీ అర్థవంతమైన పాటలొచ్చాయి. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేసి.. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు నేడు(ఆగస్టు 24). ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం.
సింగర్ కావాలని..
గుంటూరు జిల్లా, ఆరేపల్లి ముప్పాళ్లలో 1970 ఆగస్టు 24న సూర్య ప్రకాశరావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు రచయిత రామజోగయ్య శాస్త్రి. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎమ్‌టెక్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి గాయకుడు కావాలనేది ఆయన కల. పాఠశాలలోనే సినిమాల ప్రభావం మొదలైంది. పాటలన్నీ రికార్డ్ చేయించుకుని వింటూ వాటిని నేర్చుకునేవారు. సినీ పరిశ్రమ అప్పట్లో మద్రాసులో ఉండటం వల్ల ఉద్యోగం కూడా అక్కడే దొరికితే బాగుండేదని అనుకున్నారు. సింగర్ కావాలనే తన కలని చిత్ర పరిశ్రమలో నెరవేర్చుకోవాలనేది ఆయన పట్టుదల. కానీ బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడ కూడా తన అభిరుచిని, కలని వదిలిపెట్టకుండా ఆర్కెస్ట్రాలలో పాడటం మొదలుపెట్టారు.
కృష్ణవంశీ సాయంతో..
ఈ క్రమంలోనే కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాతలు పరిచయమయ్యారు. వాళ్ల సలహాతో రచయితగా ప్రయాణం ప్రారంభించారు. ముందుగా భక్తి పాటలు రాశారు. కొన్నాళ్లకు ఉద్యోగ నిమిత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ సాయంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలుసుకుని.. ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆ తర్వాత స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో వచ్చిన 'యువసేన'లో పాటల రచయితగా అవకాశం వచ్చింది. అందులో రాసిన రెండు పాటలూ ఘన విజయం సాధించడం వల్ల రామజోగయ్య శాస్త్రికి మంచి గుర్తింపొచ్చింది. అయితే ఆ తర్వాత చాలా రోజులపాటు అవకాశాలు లభించలేదు.
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'అసాధ్యుడు', 'లక్ష్మీకళ్యాణం' చిత్రాల్లో గీతాలు రాశారు శాస్త్రి. సంగీత దర్శకుడు చక్రి పరిచయంతో ఆయన కెరీర్ సరికొత్త మలుపు తిరిగింది. చక్రి స్వరాలు సమకూర్చిన పలు చిత్రాలకు గీతాలు రాశారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'ఢీ', 'రెఢీ' సినిమాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు. అనంతరం 'చిరుత', 'లక్ష్యం', 'కింగ్', 'ఖలేజా', 'దూకుడు', 'మిర్చి', 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'అల.. వైకుంఠపురంలో..', 'వకీల్‌సాబ్' .. ఇలా పలు చిత్రాల్లో పాటలు రచించారు. 'భరత్ అనే నేను'లో పాటలన్నీ రాసింది రామజోగయ్య శాస్త్రినే. 'అరవింద సమేత'లోనూ పలు గీతాలతో అలరించారు. ఇటీవలే రికార్డులు యూట్యూబ్‌లో సృష్టించిన 'బుట్టబొమ్మ' సహా 'మగువా మగువా..' సాంగ్‌నూ ఆయనే రాశారు.
నటుడిగానూ..
అప్పుడప్పుడు సినిమాల్లో అతిథి పాత్రల్లో తెరపై తళుక్కున మెరుస్తుంటారు శాస్త్రి. 'కింగ్' చిత్రంలో సంగీత దర్శకుడిగా ఓ చిన్న పాత్రను పోషించి నవ్వించారు. తెలుగువారైనా, కన్నడ చిత్రాలకీ గీతాలు రాస్తుంటారు రామజోగయ్యశాస్త్రి.
ఇదీ చూడండి.. ఇండియన్ సినిమా బాద్షా- బాలీవుడ్ షెహన్షా