తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం. కరోనా మహమ్మారికి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. సాధారణ కథను కూడా తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా, చికిత్స పొందుతూనే గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
తెలుగులో అగ్ర నటులు నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ జయరామ్.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. బ్లాక్‌బస్టర్ చిత్రాలు, 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి'తో సహా అనేక చిత్రాలు ఆయన కెమెరా కాన్వాస్ నుంచి జాలువారినవే. జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..
జయరామ్ పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఆయన ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్'కు జయరామే సినిమాటోగ్రాఫర్. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడటం వల్ల చెన్నై రైలెక్కారు. పాండీబజార్‌లో తెలుగు వాళ్లుంటారని అక్కిడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకుంటే దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు. 'ఏం చేస్తావ్?' అంటే 'నాకేమీ తెలియదు' అని బదులిచ్చారు. అప్పుడాయన ఆంధ్రా క్లబ్ సెక్రటరీ. మేనేజర్‌ని పిలిచి 'ఇతనికో జాబ్ ఇవ్వు' అన్నారు. అలా ఆ క్లబ్లో క్యాషియర్ స్థాయికి ఆయన ఉద్యోగం ఎదిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగారు.
తొలి చిత్రమే మెగాస్టార్‌తో
జయరాం కెమెరామన్‌గా తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవిది కావడం విశేషం. కెమెరా అసిస్టెంట్‌గా మొదటి సినిమా కె. బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినిమా. కెమెరామన్‌గా జయరామ్ మొదటి సినిమాకి సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. ఇందులో హీరో చిరంజీవి. సినిమా పేరు కూడా చిరంజీవే. కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు జయరామ్‌కు స్నేహితుడు. సినిమాటోగ్రాఫర్‌గా జయరామ్‌ను పెట్టుకుంటున్నామన్నప్పుడు చిరు నుంచి ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదట. చిరంజీవితో జయరామ్‌కు మొదట్నుంచీ ఉన్న సాన్నిహిత్యం కూడా కొంత కారణం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సౌందర్య ఆఖరి చిత్రానికీ!
'శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం' సినిమాటోగ్రాఫర్‌గా జయరామ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగును వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి ‘1921 సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరామ్. ఇది పీరియాడికల్ సినిమా. జయరామ్‌కు అవార్డును సంపాదించిపెట్టిన చిత్రమిది. నటి సౌందర్య ఆఖరి చిత్రం 'శివశంకర్'కు కూడా ఆయన పనిచేశారు. ఇందులో ఆమె చనిపోయే సన్నివేశాలను కూడా ఆయనే చిత్రీకరించారు. రెండ్రోజుల్లో వస్తానన్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని ఓ ఇంటర్యూలో జయరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్‌ను చూడాలన్న మోజుతో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు.. ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు జయరామ్. కె. రాఘవేంద్రరావు సినిమాలకూ, మోహన్ బాబు సొంత బ్యానర్లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాంటి లెజండరీ సినిమాటోగ్రాఫర్ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు.