రెండేళ్ల కిందట విడుదలైన 'రంగస్థలం' చిత్రం టాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను త్వరలో తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ నటించిన చిట్టిబాబు పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై కోలివుడ్‌లో ఆసక్తి నెలకొంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో చరణ్ ఒదిగిపోయాడు. రామలక్ష్మిగా సమంత, కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి, రంగమ్మత్తగా అనసూయ తమ పాత్రలను రక్తికట్టించారు. 80వ దశాబ్దంనాటి పల్లెటూరు వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన 'రంగస్థలం' కథ, నటన, పాటలు ఇలా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
'రంగస్థలం' తమిళ్ రీమేక్‌లో చరణ్ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశంపై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర చిట్టిబాబుగా నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కనిపిస్తాడని తెలుస్తోంది. లారెన్స్‌కు ఆ పాత్ర బాగా నచ్చిందట. దీంతో ఆయనే ఈ రీమేక్‌లో నటిస్తాడని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక హీరోయిన్ పాత్రను నిక్కీ గల్రానీ పోషించనుందని సమాచారం. త్వరలో చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుందని వినికిడి.