"నిజ జీవితంలో చూసిన మనుషులను.. జరిగిన కథను తీసుకుని పక్కా కమర్షియల్ చిత్రంగా మలచడమన్నది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. కథని ఎంతో జాగ్రత్తగా మలుచుకోగలిగితే తప్ప ప్రేక్షకుల్ని మెప్పించలేం. ఇవన్నీ సరిగ్గా కుదిరిన చిత్రం మా 'క్రాక్' అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రవితేజ కథానాయకుడిగా నటించారు. 'డాన్ శ్రీను', 'బలుపు' తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన విశేషాలు.
* కొత్త ఏడాదిలో సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం మాదే కావడం ఎంతో సంతోషంగా ఉంది. 'బాడీగార్డ్' తర్వాత సంక్రాంతికి వస్తున్న నా రెండో చిత్రమిది. గతేడాది మే 8న విడుదల చేయాలనుకున్నాం. మంచి పండగ సీజన్‌కి రావాలని ముందే రాసి పెట్టుందేమో.. కొవిడ్ పరిస్థితులతో అది ఇలా సాధ్యమైనట్లుంది. రవితేజ కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రం కూడా ఇదే. వెయ్యికి పైగా హాళ్లలో రిలీజ్ అవుతోంది.
* కథను నమ్మి చేసిన చిత్రమిది. కథకి తగ్గట్లుగానే ముగ్గురు ప్రతినాయకుల్ని తీసుకున్నాం. ట్రైలర్‌లో చూపించాం కదా.. 'మూడు ఎలిమెంట్స్.. ముగ్గుర్ని ఎలా ఆడుకున్నాయి, వాళ్ల ముగ్గురి జీవితాల్లో కామన్‌గా ఉన్న పోలీస్ ఆఫీసర్‌తో అవెలా కనెక్టయ్యాయి' అన్నది కథ. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. హీరో పాత్రను ప్రతిబింబించేలా టైటిల్స్ పెట్టుకోవడాన్ని రవితేజ ఎంతో ఇష్టపడుతుంటారు. 'ఇడియట్', 'కిక్', 'బలుపు' ఇవన్నీ అలాంటి ప్రయత్నాలే. అందుకే ఈ చిత్రానికి కూడా ఆయన క్యారక్టరైజేషన్‌కు తగ్గట్లుగానే 'క్రాక్' అని పెట్టాం. సినిమాలో హీరోకి డ్యూటీలో కొన్ని కొన్ని పడవు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తిస్తాడు? ఎందుకు 'క్రాక్' అవుతాడు? అన్నది ఎంతో సింపుల్‌గా చూపించాం.
* సినిమాలో రవితేజ పాత్రకి కూడా ఆరోజుల్లో ఉన్న ఒక సీఐ పాత్ర స్ఫూర్తి ఉంది. ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినా.. కథతో పాటు చక్కటి వినోదం ఉంటుంది. ఎక్కడా ఇరికించినట్లుగా ఉండదు. మేం ఎంచుకున్న కథా నేపథ్యం కొత్తది కావడం వల్ల సినిమా కూడా మేం అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది.
సంభాషణలు కూడా వాస్తవికితకు ఎంతో దగ్గరగా ఉంటాయి. సాయిమాధవ్ బుర్రా మంచి సంభాషణలు అందించారు. రవితేజతో సినిమా అనుకున్నాక.. కథపై బాగా కసరత్తు చేశా. ఎందుకంటే గత సినిమా విషయంలో కథ విషయంలో బాగా దెబ్బ తిన్నా. అందుకే దాని విలువ బాగా తెలిసొచ్చింది. నిజానికి సొంత కథతో సినిమా చేస్తున్నప్పుడు దానిపై మనకున్న పట్టు చాలా బలంగా.. వేరే స్థాయిలో ఉంటుంది. ఎవరో ఇచ్చిన కథతో అలా చేయలేం. అందుకే ఇకపై నా సొంత కథతోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా.
* 'డాన్‌శ్రీను', 'బలుపు' చిత్రాల తర్వాత రవితేజతో ఓ సినిమా చెయ్యాలనుకున్నప్పుడు ఆయనతో ఓ రియాలిస్టిక్ టచ్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు 'రంగస్థలం' లాంటి వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథల్ని బాగా ఇష్టపడుతున్నారు. నేనేందుకు మా ఊరి నేపథ్యంగా ఓ కథను ఎందుకు తీయకూడదనిపించి 'క్రాక్'తో ఆ ప్రయత్నం చేశా. ఒంగోలు ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ అల్లుకున్నా. మాది కూడా ఆ ఊరే. ఇరవై.. ముప్పయి ఏళ్ల క్రితం అక్కడ బాగా రౌడీయిజం ఉండేది. రాత్రివేళ కరెంటు తీసి మర్డర్‌లు చేయడం.. బిర్యానీ పొట్లాల కోసం, వంద, యాభై రూపాయల కోసం హత్యలు చేయడం లాంటివి జరిగేవి. అప్పట్లో అక్కడ ఇలాంటి మర్డర్‌లు చేసిన బ్యాచ్‌లు కొన్ని ఉండేవి. నేను చదువుకునే రోజుల్లో మా ఊర్లో ఇలాంటి కథలు బాగా వినేవాడ్ని. అవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. అందుకే అలాంటి యథార్థ సంఘటనలన్నీ తీసుకోని దానికి కమర్షియల్ టచ్ ఇస్తూ ఎంతో వాస్తవికంగా ఈ కథ రాసుకున్నా.
* ఈ చిత్రంలో శ్రుతిహాసన్ రవితేజ భార్యగా కనిపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆమెకిది పర్‌ఫెక్ట్ కంబ్యాక్ చిత్రమవుతుంది. సముద్రఖని ప్రధాన ప్రతినాయకుడిగా కటారి కృష్ణ పాత్రలో ఎంతో అద్భుతంగా జీవించారు. జయమ్మ పాత్రలో వరలక్ష్మి ఒదిగిపోయారు. తమన్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ మరో బలం. త్వరలో మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చేయబోతున్నా. కథ ఇప్పటికే సిద్ధమైంది.
ఇదీ చూడండి: పాన్ ఇండియాపై కన్నేసిన రష్మిక!