ఆయన ఓ నిరంతర కళాతపస్వి. శంకరాభరణాన్ని కంఠాభరణంగా చేసుకున్న ఆ తపస్వి కాశీనాథుని విశ్వనాథ్. ఆయనను తలచుకుంటే మానవతా విలువలకు పట్టం కట్టిన 'సప్తపది' గుర్తుకొస్తుంది. కల్మషం లేని ప్రేమతో 'స్వాతిముత్యం' కళ్లకు కడుతుంది. కళల గొప్పతనాన్ని గుర్తుచేసే 'సాగరసంగమం', 'స్వర్ణకమలం' స్ఫురినిస్తాయి. సంగీతాభిమానులకు 'శ్రుతిలయలు' స్వర ప్రవాహమై విహరిస్తాయి. కళాకారునికి ఉండే సహజ సిద్ధమైన ఈర్షావిద్వేషాలు బహిర్గతమయ్యే 'స్వాతి కిరణం' ప్రసరిస్తుంది. కళలకు వైకల్యం అడ్డురాదని చెప్పే 'సిరివెన్నెల' గోచరిస్తుంది. చదువు విలువలు చెప్పే 'సూత్రధారులు' కనిపిస్తారు. ఆయన సినిమాలన్నీ భారతీయ కళా సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దాలు.
ఇన్ని విశేషణాలు మూటగట్టుకున్న ఆ కళాతపస్వికి 2016 సంవత్సర చలనచిత్ర అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. విశ్వనాథ్ కళామంటపంలో ఐదు జాతీయ బహుమతులు, ఐదు నందులు, పది ఫిలింఫేర్ బహుమతులు, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య బహుమతి, పద్మశ్రీ, డాక్టరేటు వంటి పురస్కారాలున్నాయి. దాదా ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కడంతో తెలుగు సినీ కళామతల్లికి సముచిత గౌరవం ఆపాదించినట్లయింది. ఎందుకంటే... విశ్వనాధ్ తీసిన సినిమాలన్నీ ప్రబంధ గౌరవాన్ని సముపార్జించుకున్నవి కావడమే! ఆ చిరంజీవి విశ్వనాథుని గురించి కొన్ని విషయాలు... ఇవాళ ఆయన పుట్టిన రోజు (ఫిబ్రవరి 19, 1930).
మేనమామ ప్రోద్బలంతో చిత్రసీమలో అడుగు...
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, పెదపులివర్రు గ్రామం. తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ. ముగ్గురు సంతానంలో విశ్వనాథ్ ఒక్కరే మగ సంతానం. ప్రాథమిక విద్య పెదపులివర్రు, విజయవాడలోను, ఉన్నత విద్య గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలోను కొనసాగింది. 1948−49లో బి.ఎస్సీ పూర్తి చేశాక మంచి హోదాలో ఉండే ఉద్యోగం చెయ్యాలని విశ్వనాథ్‌కు కోరికగా ఉండేది. అప్పుడే మద్రాసులో వాహినీ స్టూడియో ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశ్వనాథ్ తండ్రి బెజవాడలో వాహినీ వారి సినీ పంపిణీ సంస్థలో రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండే వారు. స్టూడియో అధినేతలు వివిధ శాఖల్లో పనిచేసేందుకు కొందరు ట్రైనీలను నియమించనున్నారని తెలుసుకున్న విశ్వనాథ్ మేనమామ తాడికొండ కామేశ్వరరావు అందులో చేరితే బాగుంటుందని సలహా ఇవ్వడం, తండ్రి అంగీకరించడంతో వాహినీ స్టూడియోలోని శబ్దగ్రహణ శాఖలో చేరారు. ఆ శాఖలో మంచి పట్టు సాధించారు. ఎడిటింగ్, కళాదర్శకత్వ విభాగాల్లో కూడా తర్ఫీదు పొందారు.
అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు (1957), సాహిణీ వారి బండ రాముడు (1959) సినిమాలకు శబ్దగ్రాహకునిగా పనిచేశారు. ఆ రోజుల్లో దర్శకులకు తనకు తోచిన సలహాలు ఇస్తుండడం గమనించిన చక్రపాణి.. దర్శకత్వ శాఖకు వెళ్లమని విశ్వానాథ్కు సలహా ఇచ్చారు. తాతినేని ప్రకాశరావు, గుత్తా రామినీడు, రామనాథ్ వంటి పెద్దల వద్ద పనిచేయడం వలన సృజనాత్మకత మీద ఆసక్తి, అభిరుచి పెరిగి అభినివేశం కలిగింది. అతని నిశిత పరిశీలనా స్వభావం దుక్కిపాటి మధుసూదనరావుకు నచ్చడంతో అన్నపూర్ణా సంస్థలో సభ్యుడై దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు సహాయకుడిగా ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు పనిచేశారు. రొటీన్‌గా వుండే సినిమాలకు భిన్నంగా, వివక్షతతో కూడిన కథాంశాలతో నిశితమైన మానవ సంబంధాలను ప్రతిబింబించే సినిమాలు తీస్తే బాగుంటుందని విశ్వనాథ్ కలలు కనేవారు. మూగమనుసులు, మరో ప్రపంచం, సుడిగుండాలు వంటి సినిమాల స్క్రిప్టులు రూపొందించడంలో ఆ సంస్థకు సహకరించడం అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతగానో నచ్చింది. వెంటనే 'ఆత్మగౌరవం' (1965) సినిమాకు తొలిసారి దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని అన్నపూర్ణావారు అప్పగించడంతో విశ్వనాథ్ పూర్తిస్థాయి దర్శకునిగా మారారు. ఆ సినిమాకు నంది బహుమతి లభించింది.
ప్రైవేటు మాష్టారు, ఉండమ్మా బొట్టుపెడతా, చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి, సిరిసిరిమువ్వ, మాంగల్యానికి మరోముడి వంటి సినిమాలు సామాజిక అంశాలను స్పృశిస్తూ, మహిళల సమస్యలకు అద్దం పట్టాయి. అందుకు తగిన విధంగానే విశ్వనాథ్ ఆ సినిమాలకు పేర్లు పెట్టారు. జానపద చిత్రాలకు కాలం చెల్లుతున్న సమయంలో నిర్మాతలు డివిఎస్ రాజు, మిద్దె జగన్నాధరావులు ఎన్టీఆర్ హీరోగా విశ్వనాథ్‌తో కలిసొచ్చిన అదృష్టం (1968) నిండు హృదయాలు (1969), చిన్ననాటి స్నేహితులు (1971) వంటి కమర్షియల్ సినిమాలు నిర్మించారు. చిన్ననాటి స్నేహితులు సినిమాకు విశ్వనాథ్ కథ సమకూర్చినప్పుడు ఎన్టీఆర్ స్క్రిప్టులో కొన్ని సవరణలు సూచించగా వాటికి విశ్వనాథ్ ఒప్పుకోలేదు. ఆ సినిమా పూర్తిచేశాక ఎన్టీఆర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. విశ్వనాథ్ నిర్దుష్టమైన తన అభిప్రాయాలకు కట్టుబడే సినిమాలకు దర్శకత్వం వహించారు. మురారి యువచిత్ర సంస్థను నెలకొల్పి తొలిప్రయత్నంగా నిర్మించిన సీతామాలక్ష్మి (1978) సినిమాకు దర్శకత్వం నిర్వహించాక విశ్వనాథ్ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి సంగీత సాహిత్య నృత్య కళలకు ప్రాధాన్యం కల్పిస్తూ వైవిధ్య భరిత సినిమాలకు అంకురార్పణ చేశారు. పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునఃస్థాపించాలనే లక్ష్యంతో ఏడిద నాగేశ్వరరావు సహకారంతో 'శంకరాభరణం' సినిమా నిర్మించారు. ఆ సినిమా వైవిధ్యానికి తొలి సోపానమై నిలిచి కళాఖండాలను నిర్మించేందుకు దోహదమిచ్చింది.
సినీ కళామతల్లికి కంఠాభరణాలు
దర్శకుడిగా పరిచయమైన తొలి రోజుల్లో వరసగా ఓ సీత కథ, జీవనజ్యోతి, శారద, కాలం మారింది, నేరము−శిక్ష, చెల్లెలి కాపురం వంటి మహిళా ప్రధానమైన సినిమాలను తీస్తూ వచ్చారు. అప్పుడే సిరిసిరిమువ్వ సినిమా కీలకమైన మలుపు తిప్పింది. ఊటీలో ఆ సినిమా షూటింగు పూర్తిచేసుకొని వస్తున్నప్పుడు నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి¬తో శాస్త్రీయ సంగీత కథాంశంతో సినిమా చేయాలనే ఆలోచన గురించి విశ్వనాథ్ చర్చించారు.
>> పేరున్న నటులుంటేనే సినిమాలు వందరోజులు ఆడటం గగనమైన ఆ రోజుల్లో, నాయకుడు అంటూ ఎవరూలేని 'శంకరాభరణం' సినిమా తీసేందుకు ఉద్యుక్తులయ్యారు. ముహూర్తం రోజున వేటూరి, జంధ్యాల, మహదేవన్‌లతో 'ఈ సినిమాకి మీరే హీరోలు. కాబట్టి కొబ్బరికాయ మీరే కొట్టాలి' అని దర్శకుడు విశ్వనాథ్ చెబితే, ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా వారందరూ సినిమాకు వన్నెలు దిద్ది ప్రేక్షకుల ముందుంచి విశ్వనాథ్ ను 'కళాతపస్వి'గా రూపాంతరం చెందించారు. చిత్రం టైటిల్స్‌లోనే కళాతపస్వి ఈ సినిమా తీసిన ఉద్దేశ్యాన్ని స్పష్టంచేశారు.
>> సినిమా చూసేందుకు ముందు రసహృదయులైన ప్రేక్షకులను ఉద్యుక్తుల్ని చేస్తూ సంగీత ప్రధాన చిత్రాన్ని చూడబోతున్నట్లు వివరణ ఇచ్చారు. శాస్త్రీయ సంగీతపు అమృతధారల్ని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఆ రసగంగను అందుకొని అఖండవిజయాన్ని సాధించి పెట్టారు. సాధారణంగా సాగే ఈ సినిమాలో పాత్రలు ముప్పరిగొన్నాయి. ముఖ్యంగా శంకరశాస్త్రిగా నటించిన సోమయాజులు పాత్రను మలిచిన తీరు అమోఘం. లబ్దప్రతిష్టుడైన శంకరశాస్త్రి శంకరాభరణం రాగాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రజ్ఞావంతుడు. ఈ సినిమాని తొలుత ప్లాష్‌బ్యాక్‌లో చూపించారు. పవిత్ర గోదావరి నదీ తీరంలోని గోష్పాదక్షేత్ర రేవులో శంకరశాస్త్రి స్నానం చేసి నది ఒడ్డున చిరిగిన ధోవతిని ఆరేసుకుంటున్నప్పుడు, ఆ చిరుగులోంచి సినిమా మొదలవుతుంది. అద్వైత మూర్తిలా వెలిగిపోతూ సంగీత కచేరీలో తన ట్రేడ్ మార్కు రాగం 'శంకరాభరణం'లో రాగాలాపన చేసినప్పుడు, సంస్కృత పదబంధాలతో కూడిన "ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము" ప్రేక్షకునికి అర్థం కాదు. వేటూరి రాసిన పదాల పొందికకు మహదేవన్ మట్లు కట్టిన ఆ పాటను చిత్రీకరించిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేసింది.
శంకరశాస్త్రి ఆ రాగాలాపనలో ఎంత తాదాత్మ్యం చెందుతాడో విశ్వనాథ్ అద్భుతంగా చూపించారు. ఇందులో శంకరశాస్త్రి (జె.వి.సోమయాజులు) పాత్రతో పాటు తులసి (మంజుభార్గవి), మాధవయ్య (అల్లురామలింగయ్య), శారద (వరలక్ష్మి/ రాజ్యలక్ష్మి), శంకర (తులసీరాం/ తులసి) పాత్రల ద్వారా సంగీతపు విశిష్టతనే కాకుండా మానవత్వపు విలువల్ని, ఉన్నత మనస్తత్వాలని చక్కగా చూపించగలిగారు. ఈ సినిమా పాటల రికార్డింగు "ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము" పాటతోనే మొదలైంది.
>> విశ్వనాథ్ కథా సన్నివేశాన్ని వివరించగానే వేటూరి ఈ పాట పల్లవిని ఆశువుగా చెప్పేశారు. అయితే చరణాలు మాత్రం అంత త్వరగా పూర్తి కాలేదు. వేటూరి ఆసుపత్రిలో చేరడం, మహదేవన్ డేట్లు దొరకకపోవడం వల్ల జాప్యం జరిగింది. పాటలో జానకి పాత్ర తక్కువగా ఉండడంతో ఆమె రికార్డింగుకు రాలేదు. బాలు ఆమెను బుజ్జగించి తీసుకొని రావలసి వచ్చింది. ఈ పాత్రలతో కథను నడిపించిన తీరు, సంభాషణలు పలికించిన విధానం, ఎదలోతుల్ని స్పృశించే సంగీతం ఈ సినిమాను విజయపథంలో నడిపించాయి.
>> శంకరాభరణం సినిమా వ్యక్తిగా విశ్వనాథ్ బాధ్యతను పెంచింది. సంగీతాన్ని విశ్వనాథ్ ఒక కాన్వాస్‌గా తీసుకున్నారు. దాని మీద వేరువేరుగా ఎప్పటికప్పుడు కొత్తబొమ్మలు గీస్తున్న చందాన సప్తపది, శ్రుతిలయలు, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వాతికిరణం, సిరివెన్నెల, సూత్రధారులు, స్వర్ణకమలం వంటి అపూర్వమైన సినిమాలను రూపొందిస్తూ వచ్చారు. విశ్వనాథ్ నిర్మించే సినిమాల్లో సంగీతం, పాటలు ఉత్తమ విలువలతో ఉంటాయి. తొలిరోజుల్లో సౌండ్ రికార్డిస్టుగా పనిచేసినప్పుడు సాహిత్యాన్ని సాంకేతిక విలువలు మింగేయకుండా పాటలు చేయించుకోవడం విశ్వనాథ్‌కు అలవాటయింది. సంగీత విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్, మహాపాత్ర, షరాన్ లోవెన్‌ల సేవలను తన సినిమాలలో ఉపయోగించుకున్న సంగీత పిపాసి విశ్వనాథ్. అందుకే సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆయన సమదృష్టితో చూశారు.
కళాతపస్వి ప్రత్యేకత, పురస్కారాలు
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అధిక శాతం సినిమాల పేర్లు 'ఎస్' అక్షరంతో మొదలౌతాయి. నటుడు చంద్రమోహన్‌కు రంగులరాట్నం సినిమా తరువాత స్టార్‌గా ప్రాచుర్యం తెచ్చిపెట్టిన ఘనత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరి మువ్వ చిత్రమే. ప్రసిద్ధ సినీగేయ రచయితలు వేటూరి సుందర రామమూర్తిని ఓ సీత కథ సినిమా ద్వారా, సిరివెన్నెల సీతారామశాస్త్రిని సిరివెన్నెల సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత విశ్వనాథ్‌దే!
అలాగే జేవీ సోమయాజులిని, రమ్యకృష్ణ (సూత్రధారులు)ని పరిచయం చేసిన ఘనత కూడా విశ్వనాథ్‌దే! విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురుస్కారం బహూకరించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకు జాతీయ బహుమతులు లభించాయి. పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు నంది పురస్కారాలు విశ్వనాథ్ సినిమాలకు దక్కాయి.
మౌనయోగి
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సాంఘికాలే. పౌరాణిక సినిమాల జోలికి ఆయన వెళ్లలేదు. ఆ విషయం గురించి ప్రస్తావనకు వస్తే పౌరాణికాలు తీయడానికి వాటి మీద తనకు తగినంత అవగాహన లేదని ధైర్యంగా చెబుతారు. అంతేకాదు గౌతమ బుద్ధుడు, ఆదిశంకరుడు, అన్నమయ్య, రామదాసు వంటి సినిమాలను నిర్మించమని పెద్ద నిర్మాతల నుంచి అవకాశాలు వచ్చినా వాటిని విశ్వనాథ్ అంగీకరించలేదు. అయితే అన్నమయ్య కథను వెండితెరకు ఎక్కించాలని అవసరమైన పరిశోధన చేశారు. ఈలోగా వేరు వేరు నిర్మాతల నుంచి ఆ సినిమా తీస్తున్నట్లు ప్రకటనలు వెలువడడం వల్ల, ఆ ప్రయత్నం మానుకున్నారు. శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారం తోబాటు ఫ్రాన్స్‌లో బెసంకన్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతిని అందుకుంది. సప్తపది సినిమాకి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.
స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ బహుమతికి భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశ్వనాథ్ ఐదు సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో శుభసంకల్పం (1995), తమిళంలో కురుదిప్పునల్ సినిమాలతో నటుడిగా కెమెరా ముందుకు వచ్చి తన ప్రతిభను నిరూపించుకున్నారు విశ్వనాథ్. ఇంతటి ప్రతిభావంతుడికి ప్రభుత్వం నుంచి అందిన గౌరవం ఒక్క పద్మశ్రీ పురస్కారం మాత్రమే! సిఫారసులకు విశ్వనాథ్ దూరంగా ఉండడమే బహుశా కారణం కావచ్చు. ఇప్పుడు భారతీయ ప్రసార సమాచార శాఖకు అధిపతిగా వున్న ఒక తెలుగుబిడ్డ విశ్వనాథ్ ప్రతిభను గౌరవిస్తూ భారత అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు విశ్వనాథ్‌ను ఎంపిక చేయడం తెలుగువాడికే కాదు, ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమనిపించింది.
ఇదీ చూడండి.. "శంకరాభరణం'.. నన్ను 40 ఏళ్లు వెనక్కి పంపింది'