ఓ వ్యక్తి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అన్ని రకాల పాత్రలు చేయాలి. అలా ఈ తరం నటుల్లో ఎలాంటి పాత్రలనైనా పోషిస్తూ ప్రేక్షకుల మన్నన పొందుతున్న హీరో నవీన్ చంద్ర. ఓవైపు హీరోగా నటిస్తున్న సమయంలోనే మరోవైపు 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో విలన్‌గా అద్భుత నటన కనబరిచాడు.
2005లో వచ్చిన 'సంభవామి యుగే యుగే' సినిమాతో నటుడిగా పరిచయమైన నవీన్.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ 'అందాల రాక్షసి' చిత్రంతో వెండి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన ప్రతిభకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం బయోపిక్‌లు, ఉద్యమ సినిమాల హవా నడుస్తోంది. నవీన్ కూడా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈరోజు నవీన్ చంద్ర జన్మదినం కానుకగా మా 'కాకర్లపూడి వెంకట సీతారామారావు'కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పిడికిలి బిగించి ఉన్న లుక్‌లో నవీన్ కొత్తగా కనిపిస్తున్నాడు.

ఇవీ చూడండి.. సినీ వినీలాకాశంలో సిల్క్ స్మిత మరపురాని జ్ఞాపకం