'బాహుబలి'తో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి పెంచారు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ముఖ్యంగా జపాన్ సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించారు. ఆ దేశానికి ప్రభాస్, రానా, జక్కన్న, అనుష్క వెళ్లినప్పుడు ఎంతో ఘనంగా స్వాగతించారు. అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో కాస్త నిరాశ చెందారు.
ఇంతకీ ఏమైందంటే?
ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' తొలిపాట 'దోస్తీ'(RRR Movie Dosti song) విడుదలైంది. చెర్రీ-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాజిన్ నజిర్ (కన్నడ), విజయ్ ఏసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు స్టార్ సింగర్స్ ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. అయితే ఈ పాట తమ భాషలో ఎందుకు చేయలేదని జపాన్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.
ఈ విషయమై స్పందించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్.. "ఈ పాట ఆడియో హక్కులు కొనుగోలు చేసిన లహరీ మ్యాజిక్‌తో సంప్రదించాం. కొద్దిరోజులు ఎదురుచూడండి" అని రిప్లై ఇచ్చింది. ఆగస్టు 15న 'దోస్తీ' జపాన్ వెర్షన్ పాట రిలీజ్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న సినిమా విడుదల కానుంది. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' (మేకింగ్ వీడియో) అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: RRR movie: ఆర్ఆర్ఆర్ ట్రీట్.. 'దోస్తీ' సాంగ్ వచ్చేసింది