'జై భీమ్' వివాదానికి పూర్తి బాధ్యత వహించాలంటూ సూర్యను టార్గెట్ చేయడం అన్యాయమని, దర్శకుడిగా ఆ బాధ్యత తనదని జ్ఞానవేల్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంపై వస్తున్న వివాదాలపై ఆయన స్పందించారు.
'విడుదలకు ముందు మా బృందంలోని కొందరు సభ్యులం సినిమా చూశాం. కానీ, అభ్యంతరం వ్యక్తమైన క్యాలెండర్ దృశ్యాన్ని మేం గమనించలేకపోయాం. అప్పుడే చూసుంటే సినిమా విడుదలకు ముందే దాన్ని తొలగించేవాడిని. చిత్రం విడుదలైన రోజు నుంచే దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. వివాదం ముదరకముందే సంబంధిత సీన్‌లో మార్పులు చేశాం. ఆ సమయంలో ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అయినా, ఈ విషయంపై సూర్య బాధ్యత వహించాలని కొందరు కోరుతున్నారు. కావాలని ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం భావ్యం కాదు. దర్శకుడిగా ఆ బాధ్యత నాది. అతను ఓ నటుడిగా, నిర్మాతగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడంతే! ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల విషయంలో సూర్యను క్షమించమని కోరుతున్నాను. ఓ వ్యక్తినో, ఓ వర్గాన్నో కించపరిచే ఉద్దేశంతో ఈ సినిమా తీయలేదు. ఈ చిత్రం వల్ల బాధపడిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. కష్టకాలంలో మాకు మద్దతుగా నిలిచిన రాజకీయ, సినీ ప్రముఖులు, మీడియా, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చేయని తప్పునకు జైలుపాలై, ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయపోరాటమిది. చంద్రు పాత్రలో సూర్య నటించారు.
'అమెజాన్ ప్రైమ్' వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. విమర్శకుల్ని మెప్పించిన ఈ చిత్రాన్ని తమిళనాడుకు చెందిన వన్నియార్లు అనే వర్గం వారు వ్యతిరేకించారు. తమని అవమానించేలా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారని ఆ సంఘం అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. ఇందుకు సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: