కరోనాతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. జనాలు జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు నెలల నుంచి పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు తెరిచేందుకు వీలుపడటం లేదు. ఒకవేళ తెరిచిన ఎక్కువశాతం వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో నడుస్తున్నాయి. ఇదే తరహాలో సినిమాలు తీయడం కుదురుతుందా? అంటే అవుననే అంటున్నారు మలయాళ ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్.
భారతదేశంలోనే తొలిసారి కేవలం వర్చువల్ పద్ధతిలో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ మేకింగ్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని, ఓ అద్భుతమైన కథను చెప్పేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి గోకుల్ రాజ్ భాస్కర్ దర్శకుడు. మలయాళం, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలో పంచుకోనున్నట్లు పృథ్వీ వెల్లడించారు.
ఈయన నటించిన 'డ్రైవింగ్ లైసెన్స్', 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాలు తెలుగులో త్వరలో రీమేక్ కానున్నాయి. పృథ్వీ దర్శకత్వం వహించిన 'లూసిఫర్'ను, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చేయనున్నారు.