హిట్ సినిమాల్లో చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.! సినిమా మంచి విజయం సాధించినప్పుడే కదా నటులకు మంచి గుర్తింపు వచ్చేది. అయితే.. అలాంటి సినిమానే చేజేతులా వదులుకుంటే ఎలా ఉంటుంది. చివరికి.. అరెరే అనవసరంగా మంచి ఛాన్స్ మిస్సయ్యామే అని నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టాలీవుడ్ సంచలనం 'అర్జున్‌రెడ్డి'ని వదులుకోవడంపై హీరోయిన్ పార్వతీనాయర్ స్పందించింది.
సోషల్ మీడియాలో పార్వతి నాయర్ నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్'లో భాగంగా ఓ అభిమాని "అర్జున్‌రెడ్డిలో రొమాంటిక్ సన్నివేశాల కారణంగానే మీరు ఆ సినిమాను నిరాకరించారన్నది నిజమేనా..? ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పుడు చింతిస్తున్నారా?" అని ప్రశ్నించాడు. దానికి పార్వతి ఇలా స్పందించింది.. "ఔను నిజమే. అయితే.. అర్జున్‌రెడ్డి ఒక మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉండాల్సింది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని నమ్ముతున్నా" అని ఆమె పేర్కొంది.
వివాదాలతో మొదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఆ సినిమా అటు హీరో విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ సందీప్‌రెడ్డికి హీరోయిన్ శాలినీ పాండేకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ ఆకాశానికి తాకింది. ఆ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. అందుకే హిందీలో 'కబీర్‌సింగ్' పేరుతో, తమిళ్‌లో 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్ చేశారు. కాగా.. పార్వతీనాయర్ తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'ఆలంబన' చిత్రంలో నటిస్తోంది.