సామాజిక మాధ్యమాల్లో సందేశాలివ్వడం, విపత్తు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించడం అందరు సినీతారలు చేసేదే! కన్నడ భామ, 'అత్తారింటికి దారేది' హీరోయిన్ ప్రణీత వీళ్లందరికీ భిన్నం. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగుతుంది. చేతులారా సాయం చేస్తుంది. ఇప్పుడూ అంతే. వంటింట్లోకి దూరి గరిటె తిప్పుతోంది. అన్నాన్ని ప్యాక్ చేస్తోంది. ఆకలితో ఉన్నవారికి అందేదాకా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్ వేళ.. మనసున్న మనిషిగా ఎందరినో ఆదుకుంటోంది ప్రణీత.
"ఈ సమయంలో దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సినిమా అసిస్టెంట్లు, లైట్‌బాయ్‌లు, తోపుడు బండ్ల వ్యాపారులకు పని లేదు. చేతిలో డబ్బుల్లేవు. తిండి కరవైంది. అలాంటివారి ఆకలి తీర్చడానికి మా ప్రణీత ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది."
- ప్రణీత
లాక్‌డౌన్ మొదలవగానే అందరికన్నా ముందే తనవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చింది. అంతటితో ఊరుకోలేదు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బాధితుల్ని ఎంపిక చేసి, రూ.10 లక్షల విరాళాలు సేకరించి నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేయించింది. ఆపన్నులకు నిరాటంకంగా ఆహారం అందిస్తోంది.
బాల్యం నుంచే..
నటించడం పదేళ్ల కిందటే మొదలైనా, సాయపడటం చిన్నప్పుడే ప్రారంభించింది ప్రణీత. అమ్మానాన్నలు వైద్యులు. ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు. పేదలకు ఉచితంగా వైద్యం చేసేవారు. వారి నుంచి ప్రేరణ పొందింది. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీని పేదలకు ఇస్తుండేది. సినిమాల్లోకి వచ్చాక టెక్నీషియన్స్‌కు సాయపడుతూ పెద్దమనసు చాటుకుంటూనే ఉంది.
ఆర్థికంగా నిలదొక్కుకున్నాక ఏడాదిన్నర కిందట ‘ప్రణీత ఫౌండేషన్’ను ప్రారంభించింది. కేరళ, ఉత్తర కర్ణాటక, కూర్గ్ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు స్పందించింది. వాలంటీర్లతో కలిసి బియ్యం, నిత్యావసరాలు సేకరించి ట్రక్కుల్లో పంపింది. మెడికల్ క్యాంపులు నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది.
ఆదుకోవాల్సింది ఇప్పుడే..
సినిమా తారలు సహజంగానే జనాల్లోకి వెళ్లడానికి ఇష్టపడరు. కరోనా కాలంలో అసలే భయం. ప్రణీతని అదే మాటడిగితే భిన్నంగా స్పందించారామె.
"మొదట్లో నాకూ భయంగానే ఉండేది. కానీ అందరిలా ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు కదా. చేతులకి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నా. జనం ఆపదల్లో ఉన్నప్పుడే కదా మనం ఆదుకోవాలి. మన వీలు చూసుకొని చేసేది సాయమెలా అవుతుంది? నిజానికి నాకన్నా ఎక్కువగా కష్టపడుతోంది మా వలంటీర్లే. నేను వాళ్ల వెనక ఉంటున్నానంతే."
- ప్రణీత