తన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది హీరోయిన్ రష్మిక. ఇప్పటికి ఈ ముద్దుగుమ్మ చిత్ర సీమలోకి వచ్చి ఐదేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఎప్పుడైనా ఈ రంగాన్ని వదిలేయాలనే ఆలోచన వచ్చిందా'? అని అడగ్గా.. ఆసక్తికర విషయాలు పంచుకుంది రష్మిక.
"నిజం చెప్పాలంటే.. నాకు తొలి సినిమా చేసిన వెంటనే ఇలాంటి ఆలోచన వచ్చింది. నా మొదటి చిత్రం 'కిరిక్ పార్టీ'’ విడుదలవ్వగానే తెలుగు నుంచి అనేక అవకాశాలు తలుపుతట్టాయి. కానీ, అప్పటికి నేను సినిమాలే పూర్తిగా మానేద్దామనుకున్నా. తెలుగులో నటించడమైతే అసలు సాధ్యం కాదనుకున్నా. ఎందుకంటే తెలుగు నాకసలు పరిచయం లేని భాష. దాంతో ఇటువైపు రావాలన్న ఆలోచనే లేదు. కానీ, తొలి విజయం అందించిన ఉత్సాహం, స్ఫూర్తితో కొన్ని కన్నడ చిత్రాలు ఒప్పుకున్నా. దాంతో తెలుగు నుంచి అవకాశాలొచ్చినా తొలి రెండేళ్లు ఇక్కడ సినిమాలు చెయ్యలేని పరిస్థితి."
- రష్మిక, సినీ నటి
"కొన్నాళ్ల తర్వాత 'కిరిక్ పార్టీ' చూసి దర్శకుడు వెంకీ కుడుముల 'ఛలో' కోసం నన్ను సంప్రదించారు. ఆయన చెప్పిన కథ, అందులోని నా పాత్ర విపరీతంగా నచ్చి ఆ చిత్రానికి పచ్చజెండా ఊపేశా. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగులోనే జెండా పాతేశా. ఇప్పుడీ ప్రయాణాన్ని తలచుకుంటుంటే ఓ కలలా అనిపిస్తుంటుంది". అని రష్మిక చెప్పుకొచ్చింది.