విభిన్న పాత్రలు చేసే తెలుగు హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఇటీవలే 'జాను' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాలో రైతుగా నటిస్తున్నాడు. దీని షూటింగ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయింది. అయితే ఇతడి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది.
శర్వానంద్ గతంలో తమిళంలో 'ఎంగేయుమ్ ఎప్పోతమ్'(తెలుగులో 'జర్నీ')లో హీరోగా నటించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత అక్కడ ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఖరారు కానుంది. కరోనా ప్రభావం తగ్గాక, మే నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవొచ్చని టాక్.