"వాణిజ్య ప్రధానమైన సినిమా చేసినా.. అందులో ఏదో రకంగా కొత్తదనం ఉండాలనుకుంటా. నటుడిగానూ నేను సవాళ్లను ఇష్టపడతా. అచ్చంగా.. అలాంటి కథ, పాత్రలతోనే 'అల్లుడు అదుర్స్' రూపొందింది" అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిశ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
కొత్తగా ఉంటుంది.. ఆస్వాదిస్తారు
పరాజయం ఎదురైతే మళ్లీ వెంటనే సినిమా మొదలు పెడతామేమో కానీ.. విజయం వచ్చిందంటే జాగ్రత్తగా అడుగులు వేస్తాం. 'రాక్షసుడు' విజయం తర్వాత మూడు నెలలపాటు కథలు వినడంపైనే దృష్టిపెట్టా. సంతోష్ శ్రీనివాస్ అన్న చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. ముఖ్యంగా ద్వితీయార్థం నాకు బాగా నచ్చింది. రోహిత్‌శెట్టి 'గోల్‌మాల్' చూస్తున్నప్పుడు ఒక వాణిజ్య కథలో 'హారర్ అంశాలా, భలే ఉందే' అని ఆశ్చర్యపోయా. మళ్లీ అలాంటి అనుభూతి ఈ కథ విన్నప్పుడు కలిగింది. ఎప్పుడూ మనం చూసే కుటుంబ కథలు కాకుండా, ఇది చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలూ ఆస్వాదిస్తారు.
'అల్లుడు..' అచ్చొచ్చింది
మా కథలో దెయ్యం ఉంటుంది కానీ.. అది భయపెట్టే దెయ్యం కాదు, కామెడీ దెయ్యం. పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. అందుకే నటన పరంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. సన్నివేశాలు పక్కాగా రావడం కోసం శిక్షణ కూడా తీసుకుని నటించా. ఇందులో డ్యాన్స్ చాలా బాగుంటుంది. 'అల్లుడు శీను'గా నేను పరిచయమయ్యా. ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' అంటూ వస్తున్నా. అల్లుడు అనే మాట నాకు బాగా అచ్చొచ్చింది.
ఉత్తరాదిలోనూ అభిమానిస్తున్నారు
నా సినిమాలు హిందీలో డబ్ అవ్వడం, అంతర్జాలంలో వాటికి చక్కటి ఆదరణ లభిస్తుండడం వల్ల ఉత్తరాదిలో నన్ను అభిమానించేవాళ్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. 'అల్లుడు అదుర్స్' పాట చిత్రీకరణ కోసం కశ్మీర్ వెళితే అక్కడ అందరూ గుర్తుపట్టి మాట్లాడిస్తున్నారు. నేను హిందీలో పరిచయం కావడానికి ఇది సరైన సమయం అనిపించింది. సరిగ్గా ఇదే సమయంలోనే 'ఛత్రపతి' రీమేక్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌లో ఒక సెట్ వేస్తున్నాం. కథానాయిక ఎంపిక ప్రక్రియ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమాని పాన్‌ఇండియా స్థాయిలో తీయాలనే ఆలోచనలో ఉన్నాం.
ఇదీ చూడండి: కొత్త పోస్టర్లు.. టాలీవుడ్లో సంక్రాంతి సందడి షురూ