ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. యూఎస్ మీడియా రాసిన ఈ కథనంపై మాట్లాడేందుకు అతడి ప్రతినిధి నిరాకరించారు. మీటూ ఆరోపణల్లో భాగంగా 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు హార్వే. రైకర్స్ ఐలాండ్ జైలులో ఉన్న ఇతడిని ప్రస్తుతం బఫెలో నగర సమీపంలోని కారాగారానికి తరలించారు.
ఫిబ్రవరిలో ఇతడిపై నటి జెస్సికా మన్ ఆరోపణలు చేసింది. 2013లో తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అయితే హార్వే వల్ల దాదాపు 90 మంది హాలీవుడ్ నటీమణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
జైళ్లలో రద్దీయే కారణం
అమెరికా జైళ్లలో రద్దీ కారణంగా కరోనా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గత వారమే రైకర్స్, న్యూయార్క్ జైళ్లలో సిబ్బందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఆదివారం నాటికి అమెరికాలో కరోనా వల్ల 417 మంది మరణించారు. సుమారు 33వేలమందికిపైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు.