సాధారణంగా అభిమాన హీరోతో సెల్ఫీ, ఫొటో దిగేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. ఒక్కోసారి వారికి తాము రూపొందించిన పెయింటింగ్‌లు, కళాఖండాలు బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ అభిమానిని స్టార్ హీరోయే స్వయంగా గిఫ్ట్ అడిగారు. తనకు బహుమతి పంపించమని అడ్రస్, మెయిల్ ఐడీ కూడా చెప్పారు. ఆ విశేషాలు చూద్దాం రండి.
అలా గిఫ్ట్ చేరింది...
హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ఇటీవలే తన 73వ పుట్టినరోజు జరుపుకొన్నారు. అయితే ఆ ప్రత్యేకమైన రోజు కోసం ర్యాండన్ అనే అభిమాని చెక్కతో సిగార్ పైప్‌ను తయారు చేశాడు. తనదైన కళకు పదునుపెట్టి.. చేతితోనే ఆ కళాఖండాన్ని రూపొందించాడు. ష్వార్జ్‌నెగ్గర్ పోషించిన 'టర్మినేటర్'లోని పాత్రను అందంగా చెక్కి దానికి రంగులు అద్దాడు. దాని ఫొటోలను సామాజిక మాధ్యమం రెడిట్‌లో పోస్టు చేశాడు. ఆ చోటా ఈ చోటా తిరుగుకుంటూ వచ్చిన ఆ పోస్టు.. చివరకు ఆర్నాల్డ్ కంటపడింది.

ఇంకేముంది చూడగానే ఆ కళాఖండానికి ఫిదా అయిపోయారు స్టార్హీరో. ఆ బొమ్మను తనకు అమ్మాలని ఆ అభిమానిని కోరారు. ఒకవేళ తనకు ఆ బొమ్మ ఇస్తే.. దానితో దిగిన ఫొటోపై డిజిటల్ సంతకం చేసి పంపిస్తాననీ మాట ఇచ్చారు. ఆర్నాల్డ్ పోస్టుకు స్పందించిన ఆ అభిమాని... ఇష్టమైన హీరోకు ఉచితంగానే దాన్ని ఇస్తానని, అడ్రస్ చెప్పాలని కోరాడు. అలా అది ఆర్నాల్డ్ చెంతకు చేరింది.
ఇక హామీ ఇచ్చినట్లుగానే దానితో దిగిన ఫొటోపై సంతకం చేసి ర్యాండన్కు పంపారు ష్వార్జ్‌నెగ్గర్.
