భారత్ -చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు యావత్ దేశం కన్నీటి నివాళు అర్పిస్తోంది. చైనా సైనికులతో జరిగిన పోరాటంలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతోపాటు మరో 19 మంది భారత జవాన్లు మృతి చెందడం పట్ల తెలుగు సినీనటీనటులు సామాజిక మాద్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహేశ్ బాబు, దేవిశ్రీప్రసాద్, నిఖిల్, అనిల్ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, మంచు లక్ష్మి, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. చైనా అహంకార పూరిత చర్యలపై రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులన్నింటినీ బహిష్కరించాలని కథానాయకుడు నిఖిల్ పిలుపునిచ్చాడు. సంతోష్ బాబు తల్లిని ఉద్దేశిస్తూ మీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోమని, మేమంతా మీతోనే ఉన్నామనే ధైర్యాన్నిస్తూ ట్వీట్ చేశారు.
అమర జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికి మరిచిపోదని, వారి త్యాగాలు హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యానికి, దేశభక్తికి సలాం చేస్తున్నట్లు తెలిపిన మహేశ్.. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లోని పాటతో జవాన్లకు నివాళులర్పించారు.