Producer naga vamsi: రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే సినిమా 'డీజే టిల్లు'. ఇందులో నవ్వులతో పాటు చిన్న సందేశమూ ఉంది" అని అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన నిర్మాణంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమే ఈ 'డీజే టిల్లు'. విమల్ కృష్ణ దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిర్మాత నాగవంశీ.
'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా నచ్చి సిద్ధును ఇంటికి పిలిచి మాట్లాడా. ఏమన్నా కొత్త కథ ఉంటే చెప్పమంటే.. ముందు ఓ రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ వినిపించాడు. అది కాకుండా ఏదన్నా చెప్పమంటే.. ఓ క్రైమ్ కామెడీ కథ ఉందని చెప్పాడు. నిజానికి అప్పటికి తను దీన్ని ఓ చిన్న ఐడియాలాగే చెప్పాడు. తర్వాత చాలా మార్పులు చేర్పులు చేసి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మా బ్యానర్లో ఇప్పటి వరకు ఫ్యామిలీ కథలు, రొమాంటిక్ కామెడీ డ్రామాలే చేశాం తప్ప.. ఇలాంటి కామెడీ థ్రిల్లర్ కథలు ప్రయత్నించలేదు. అందుకే ఈ స్క్రిప్ట్ వినగానే చేయాలనిపించింది.
* కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఫ్యామిలీ ఆడియెన్స్ సరిగా థియేటర్లకు రావట్లేదు. దానివల్లే మా 'రంగ్‌దే', 'వరుడు కావలెను' చిత్రాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయాం. ఈ తరుణంలో కొన్నాళ్లు యూత్‌ఫుల్ సినిమాలు చేస్తే బాగుంటుందనిపించి ఆ దిశగా దృష్టి పెట్టాం. ఈ 'డీజే టిల్లు' పూర్తిగా యువతరాన్ని లక్ష్యం చేసుకుని తీసిన సినిమానే. ట్రైలర్ చూస్తే ఎంత వినోదభరితంగా అనిపించిందో.. సినిమా చూస్తే అంతకు రెట్టింపు వినోదం లభిస్తుంది.
* సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈతరం ఆడపిల్లలు ఎలా ఉన్నారన్నది ఇందులో చూపించాం. ఈ చిత్రంలో టిల్లు చాలా అమాయకుడిగా కనిపిస్తాడు. నాయిక పాత్ర అతన్ని ఆడేసుకుంటుంటుంది. అదే ప్రేక్షకులకు మంచి వినోదం పంచిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'డీజే టిల్లు 2' తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇందుకు తగ్గట్లుగానే ఇప్పుడీ చిత్ర క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా ముగించాం.
* ఈ సినిమా అనే కాదు.. మేము ఏ చిత్ర విషయంలోనైనా త్రివిక్రమ్ సలహాలు, సూచనలు తీసుకుంటాం. తొలుత ఆయనకే కథ వినిపిస్తాం. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక.. దర్శకుడి పనిలో ఏమాత్రం వేలు పెట్టం. ఈ చిత్రాన్ని తొలుత ఫిబ్రవరి 18నే తీసుకొద్దామనుకున్నాం. ఈలోపు పరిస్థితులన్నీ కుదట పడితే 25న 'భీమ్లా నాయక్'ను తీసుకురావాలన్న ఆలోచన ఉంది. రెండు చిత్రాలకూ మధ్య రెండు వారాల గ్యాప్ ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో 'డీజే టిల్లు'ను 12నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.
* థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే 'భీమ్లానాయక్'ను ఈనెల తీసుకురావాలా? వద్దా? అని నిర్ణయించుకుంటాం. ఇప్పటికైతే సినిమా రెడీ అయింది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరిస్తున్నాం. లాక్డౌన్లో చాలా కొత్త కథలు విన్నాం. కొన్ని ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ధనుష్ 'సార్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: