సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ తీసిన లఘు చిత్రం, పాటను కమిషనర్ సజ్జనార్‌తో కలిసి రాజమౌళి, కీరవాణిలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్లాస్మా దాతలను దర్శకుడు రాజమౌళి అభినందించారు. సైబరాబాద్ పోలీసులు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని రాజమౌళి పేర్కొన్నారు. కొవిడ్ సోకినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా బయటపడొచ్చని సూచించారు. వైరస్‌ను సకాలంలో గుర్తిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
కొవిడ్ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్న రాజమౌళి.. వైద్యులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైరస్ బాధితులు పౌష్టికాహారం తీసుకోవాలని.. పరిస్థితి విషమించాక ఆసుపత్రికి వెళ్తే.. వైద్యులకూ కష్టంగా ఉంటుందని తెలిపారు. తాను ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్