స్టార్ కపుల్స్ తమ భాగస్వామి పుట్టినరోజు వేడుకలకు విలువైన వాటిని కానుకగా ఇస్తుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ మాత్రం తన భార్య ట్వింకిల్ ఖన్నాతో డేటింగ్లో ఉన్న సందర్భంలో ఆమె తొలి పుట్టినరోజుకు పేపర్ వెయిట్‌ను బహుమతిగా ఇచ్చారు. తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో ఇంటర్వ్యూలో అక్షయ్-ట్వింకిల్ ఈ విషయాన్ని తెలిపారు.
ట్వింకిల్ ఖన్నా చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్ కథ వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కరణ్.. ట్వింకిల్‌ను అడిగారు. దీంతో ఆమె ఈ పేపర్‌వెయిట్ ఫ్లాష్‌బ్యాక్‌ను తెలిపింది.
"మేము డేటింగ్లో ఉన్న సందర్భంలో నా తొలి పుట్టినరోజుకు అక్షయ్ పేపర్ వెయిట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అతను దాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. కానీ అది నాకెంతో నచ్చింది. అదే సమయంలో ఏదో ఒక రోజు నాకు డైమండ్ రింగ్ బహుమతిగా ఇవ్వాలని అడిగా. దీంతో నాకు ఈ వజ్ర ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు."
-ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ భార్య.
ట్వింకిల్ ఖన్నా పుట్టినరోజును తాను అప్పుడు మర్చిపోయినట్లు తెలిపారు అక్షయ్. అనంతరం గుర్తుకువచ్చేసరికి బయటికి వెళ్లి బహుమతి కొనేంత సమయంలేక ఇంట్లోనే ఉన్న పేపర్ వెయిట్‌ను కానుకగా ఇచ్చినట్లు చెప్పారు.
ఇది చూడండి : 'సుశాంత్ మృతిపై బాలీవుడ్ సమాధానం చెప్పాలి!'