Darshakaratna Film: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జీవితం ఆధారంగా 'దర్శకరత్న' తెరకెక్కనుంది. ధవళ సత్యం దర్శకత్వం వహిస్తారు. తాడివాక రమేష్‌నాయుడు నిర్మాత. ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.
![Dasari Narayana Rao Movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14182703_img5.jpg)
Dasari Narayana Rao New Movie: ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అందరివాడిగా ఎంతోమందికి మార్గదర్శకం దాసరి నారాయణరావు. మేరుశిఖరంలా ఎదిగిన ఆయనతో నాకున్న అనుబంధమే ఈ చిత్రం చేయడానికి కారణమైంది. నాకు తెలిసిన, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతోపాటు ఎంతో మందిని సంప్రదించి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం" అన్నారు. నిర్మాత మాట్లాడుతూ "జాతీయ స్థాయి నటుడు ఈ సినిమాలో దాసరి పాత్రని పోషిస్తారు. దాసరి పద్మ పాత్రలోనూ గుర్తింపున్న ఓ ప్రముఖ నటి కనిపిస్తారు. తెలుగు, హిందీ, తమిళంతోపాటు, పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తాం. కరోనా పరిస్థితులు అదుపులోకి రాగానే చిత్రీకరణ మొదలుపెడతాం" అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రేలంగి నరసింహారావు, కాశీవిశ్వనాథ్, ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, రామకృష్ణ గౌడ్, కాజా సూర్యనారాయణతోపాటు, పాత్రికేయులు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బంగార్రాజులో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి: నాగ్