ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీని బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వీలైనంత జాగ్రత్తగా ఉండాలని అటు ప్రభుత్వాలు, ఇటు రాజకీయ, సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, నటుడు రవిబాబు వినూత్న ప్రచారానికి తెర తీశాడు.
నూతన నటీనటులతో రవిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం 'క్రష్'. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రెండు పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. ఓ ఫొటోలో జిమ్ చేస్తున్న ముగ్గురు యువకులు నోటికి మాస్క్‌లు ధరించి పక్కనే ఉన్న అమ్మాయిని తదేకంగా చూస్తుంటారు. ఆమె కూడా మాస్క్ ధరించే వ్యాయామం చేస్తుంటుంది. మరో ఫొటోలో ఓ అమ్మాయి, అబ్బాయి మాస్క్ ధరించి ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తారు. రెండింటిలోనూ 'బీ సేఫ్' అనే ట్యాగ్ జోడించారు. ఆసక్తిగా ఉండటం వల్ల ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్స్ వైరల్ అవుతున్నాయి.