టాలీవుడ్-బాలీవుడ్-కోలీవుడ్ అనే బేధం లేకుండా ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఒకరు తరువాత ఒకరు వరుసపెట్టి మరి ఈ సినిమాలు తీస్తున్నారు. కొత్త ఏడాది మొత్తం హిందీ చిత్రసీమలో బయోపిక్‌ల ట్రెండ్ నడిచేలా ఉంది. సినిమా, క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖుల జీవితాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి.
దర్శకనిర్మాతలు.. ప్రముఖుల జీవితాలను వెండితెరపై చాలా ఆసక్తికరంగా మార్చుతున్నారు. ప్రేక్షకులూ వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అందుకే బాలీవుడ్‌లో ఏకకాలంలో వివిధ రంగాల ప్రముఖుల జీవితాలను రానున్న ఏడాది ఎక్కువగా చూపించబోతున్నారు. వాటిలో కొన్నింటి వివరాలు ఇవి.
ఛపాక్-లక్ష్మి అగర్వాల్
వెండితెరపై హీరోయిన్లు ఉన్నదే అందంగా కనిపించటానికి. అలాంటిది సినిమా మొత్తం అందవిహీనంగా కనిపించేందుకు సిద్ధమైపోయింది గ్లామర్ క్వీన్ దీపిక పదుకొణె. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోపిక్ 'ఛపాక్'లో టైటిల్ రోల్ పోషిస్తోంది. కథ నచ్చి, నిర్మాణంలోనూ భాగస్వామిగా మారింది. ఇప్పటికే ప్రచార చిత్రం అలరిస్తోంది. దీపిక నటన ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
83-కపిల్ దేవ్
భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భాలు ఎలా ఉన్నాయో మీకు తెలియాలంటే '83'సినిమా వచ్చేంత వరకు ఎదురు ఆగాల్సిందే. కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నారు. రణ్వీర్-దీపిక జంటగా నటిస్తున్నారు.
భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని, అప్పటి పరిస్థితుల్ని ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన కపిల్‌దేవ్ లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న క్రికెట్, సినీ ప్రేమికుల్ని పలకరించబోతోంది.
తలైవి-జయలలిత
సాధారణ మహిళ నుంచి ఓ నటిగా.. ఆ తర్వాత ఓ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జయలలిత తీరు అసాధారణం, ఆసక్తికరం. అందుకే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తెస్తున్నారు. 'తలైవి' పేరుతో తెరకెక్కిస్తున్నారు. కంగనా టైటిల్ రోల్లో కనిపించనుంది. చాలా మంది స్టార్స్.. ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
మలాలా-మలాలా యూసుఫ్‌జాయ్
పాకిస్థాన్ సాహస బాలిక మలాలా.. తోటి బాలికల చదువు కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడింది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీవితం ఆధారంగా 'గుల్ మకాయ్' తీస్తున్నారు. మలాలా పాత్రలో రీమ్ షేక్ నటిస్తోంది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సైనా నెహ్వాల్- షట్లర్ సైనా నెహ్వాల్
క్రీడాకారుల జీవితాల్లో ఎత్తుపల్లాలు చాలా సహజం. అలా సహజంగానే సినిమా కథలకు దగ్గరగా ఉంటాయి. కెరీర్‌లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, స్టార్ షట్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సైనా నెహ్వాల్ బయోపిక్.. వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె పాత్రలో పరిణీతి చోప్రా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన లుక్ అంచనాలు పెంచుతుంది.
ఇంకా ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్(తెలుగు), అభినవ్ బింద్రా, మిథాలీరాజ్(బాలీవుడ్-తాప్సీ) బయోపిక్‌లు వచ్చే ఏడాదే విడుదల కానున్నాయి. భారతదేశ ప్రముఖ తత్వవేత్త ఓషో రజనీష్ బయోపిక్, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌లూ రానున్న సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండిటిపై అధికారిక ప్రకటన రావాలి.