లఘు చిత్రాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని 'కలర్ ఫొటో' ద్వారా తెలుగు తెరపై కథానాయకుడిగా పరిచయమైన విజయవాడ కుర్రాడు సుహాస్. గతేడాది అక్టోబర్‌లో ఆహా వేదికగా విడుదలైన 'కలర్ ఫోటో' సుహాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 'రైటర్ పద్మభూషణ్'గా థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నేడు (ఆగస్టు 19) సుహాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడిన సుహాస్.. హీరోగానే కాకుండా తనను నిలబెట్టిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మరికొన్ని సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. సుహాస్ చెప్పిన విశేషాలు అతన్ని మాటల్లోనే..
రైటర్ పద్మభూషణ్
'కలర్ ఫోటో' తర్వాత నేను లీడ్‌గా చేస్తున్న రెండో సినిమా 'రైటర్ పద్మభూషణ్'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్. గతేడాది అక్టోబర్‌లో 'కలర్ ఫోటో' విడుదలైంది. ఈ అక్టోబర్‌కు 'రైటర్ పద్మభూషణ్' రాబోతుంది. ఇందులో చాలా పెద్ద నటీనటులున్నారు. అమ్మానాన్న పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, రోహిణిలు చేశారు. సీనియర్ నటీనటులతో పనిచేస్తుంటే మొదట్లో భయపడ్డా. కానీ వాళ్లు నాతో కలిసిపోయి ఎంతో చక్కగా మాట్లాడుతుంటే సంతోషం వేసేది. సినిమాలో నా పేరు పద్మభూషణ్. యువ రచయితగా కనిపిస్తా. సినిమా ఆద్యంతం నవ్వుతూ ఎమోషనల్‌గా సాగుతుంటుంది. ఈ సినిమా దర్శకుడు షణ్ముక ప్రశాంత్ నేను షార్ట్ ఫిలింస్ చేసేటప్పుడు పరిచయం. తననే ఇమిటేట్ చేస్తూ ఈ సినిమాలో నటించా. నా పక్కన టీనా శిల్పరాజ్ అనే తెలుగుమ్మాయి హీరోయిన్గా నటించింది. మంచి రోల్ ఆమెది. ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. వచ్చే నెలలో రైటర్ పద్మభూషణ్ పాటలు విడుదలవుతాయి.
వాళ్ల సినిమాలో లీడ్‌గా ఉంటాననుకోలేదు
చాయ్ బిస్కెట్ సంస్థ అనురాగ్-శరత్‌లు నన్ను చాలా ప్రోత్సహించారు. చాయ్ బిస్కెట్లో చేరినప్పటి నుంచి హీరో కావాలనేది నా కల. వాళ్ల సినిమాల్లో నేను లీడ్‌గా చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. 'రైటర్ పద్మభూషణ్' చాలా మంచి కథ. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కావల్సినంత బడ్టెట్ ఇచ్చి ఈ సినిమా చేశారు.
జూనియర్ ఆర్టిస్ట్‌గా వర్కవుట్ కాలేదు
విజయవాడ నుంచి 2012లో హైదరాబాద్ వచ్చా. సినిమాలపై ఇష్టంతో ఆడిషన్స్‌కు వెళ్తుండేవాణ్ని. జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశా. రవితేజతో కలిసి ఓ యాడ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా నటించా. చిన్న చిన్న సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నెట్టుకుంటూ వచ్చా. జూనియర్ ఆర్టిస్ట్‌గా వర్కవుట్ అవడం లేదని నేనే చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ తీయడం మొదలుపెట్టా. లక్కీగా అప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉండటం వల్ల నా షార్ట్ ఫిలింస్ వైరల్ అయ్యాయి. అప్పుడు చాయ్ బిస్కెట్లో ఉన్న కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ పరిచయం అయ్యారు. మంచి రచయితలు, టీం దొరికారు. అనుకున్నట్లే షార్ట్ ఫిలింస్ సక్సెస్ అయ్యాయి. తర్వాత సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చాయి. అవన్నీ నా కలర్ ఫోటోకు ఎంతో ఉపయోగపడ్డాయి. మిగతా సినిమాలు చేయడానికి మరింత ప్రోత్సాహం దొరికింది.
రవితేజ ఇంటికి పిలిచారు
'కలర్ ఫోటో' విడుదలైన తర్వాత రవితేజగారు ఇంటికి పిలిపించుకొని అభినందించారు. ఆయన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్‌గా చేసిన నన్ను పిలిచి అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సాయితేజ్, నాని, శర్వానంద్‌లు నన్ను చాలా బాగా ప్రోత్సాహిస్తుంటారు.
![suhash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12813373_suhash.jpg)
హీరోగా ఉండాలనే రూల్ ఏం పెట్టుకోలేదు
క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా 'ఏజెంట్ ఆత్రేయ', 'మజిలి', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి చిత్రాలు చేస్తునప్పుడు 'కలర్ ఫొటో'లో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా చేయాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించా. సందీప్ చెప్పిన కథ బాగా నచ్చడం వల్ల భవిష్యత్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తానని ఒప్పుకున్నా. సినిమా విడుదలైన తర్వాతా చాలా మంది నటుడిగా నన్ను అంగీకరించారు. అయితే నాకు మిగతా సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాని సినిమా 'అంటే సుందరానికి' చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశా. హీరోగానే ఉండాలని రూల్ ఏం పెట్టుకోలేదు.
ఇప్పుడు కారులో తిరుగుతున్నాం
నేను సినిమాల్లోకి వెళ్తానంటే మొదట్లో మా కుటుంబం చాలా భయపడింది. మధ్యతరగతి కుటుంబం మాది. అమ్మానాన్న విజయవాడలో ఉంటారు. నాన్న రిటైర్ ఆర్పీఎఫ్, అమ్మ గృహిణి. 'కలర్ ఫొటో' విడుదలైన తర్వాత కనిపించిన వాళ్లందరూ మీ అబ్బాయి బాగా చేశాడు, సినిమా బాగుందని చెప్పడం వల్ల అమ్మానాన్నలో టెన్షన్ పోయింది. చాలా సంతోషించారు. నేను మా నాన్న చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగేవాళ్లం. బండి మీద వెళ్లేవాళ్లం. 'కలర్ ఫోటో' తర్వాత ఇప్పుడు కారులో తిరుగుతున్నాం. చాలా స్పెషల్ మూమెంట్స్ అవి నాకు. కానీ నేను ఇంత బిజీగా ఉండి మంచి సినిమాలు చేయడానికి నా భార్య కూడా కారణం. తన సపోర్ట్ చాలా ఉంటుంది. తను డిగ్రీ నుంచి పరిచయం. క్లాస్ మేట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తను లేకపోతే ఇంత ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ ఉండేవాణ్ని కాదు.
ఇదీ చూడండి: 'కలర్ ఫొటో' టీమ్‌కు రవితేజ అభినందనలు