వెండితెరపై ఆయనేమీ భారీ డైలాగ్‌లు చెప్పలేదు. సిక్స్ ప్యాక్ బాడీతో రౌడీలను ఇరగదీయనూలేదు. అదిరిపోయే డ్యాన్సులు చేయలేదు. ఆయన చేసింది కేవలం తన హావభావాలతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టి కడుపుబ్బా నవ్వించడమే. తలపై టోపీ, చేతిలో కర్ర, చిన్న మీసం ఇవి చాలు ఆయనెవరో ఇట్టే చెప్పేస్తారు. యావత్ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీచాప్లిన్.
చార్లీ చాప్లిన్ ప్రతి చిత్రమూ ఒక అద్భుతమే. ఆయన తీసిన 'ది ఐడిల్ క్లాస్' 1921లో విడుదలైంది. అప్పటికే చాప్లిన్ విశ్వవిఖ్యాతి పొందారు. ఈ చిత్రాన్ని అమెరికా బెల్లింగామ్‌లోని లిబర్టీ థియేటర్లో ప్రదర్శించారు. అయితే ఆ థియేటర్ యజమాని ఓ వినూత్న పద్ధతి ప్రవేశపెట్టాడు. అంతకు ముందొచ్చిన చాప్లిన్ చిత్రం 'ది ట్రాంప్' లోని చాప్లిన్ గెటప్‌తో ఎంతమంది వస్తే, అంతమందికీ ఉచితంగా ఈ సినిమా చూపిస్తానన్నాడు. టోపీ, కోటు, చేతికర్ర, మీసం పెట్టుకుని వందలమంది చిన్నా, పెద్దా చాప్లిన్ వేషం వేసుకుని వచ్చారు! ఆ దృశ్యం గొప్ప వేడుకను తలపించిందట. అప్పట్లో 'స్పాన్' పత్రిక ఆ ఫొటోను ప్రచురించింది.