ఇండియాలో బెస్ట్ వెబ్ సిరీస్‌గా గుర్తింపు దక్కించుకుంది 'ఫ్యామిలీ మ్యాన్' (The Family Man). దానికి కొనసాగింపుగా రెండో సీజన్ (The Family Man Season 2) జూన్ 4న అమెజాన్ (Amazon Prime) ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఇంతలా విజయం సాధించడం వెనక ఆ పాత్రల తీరుతెన్ను కూడా ఓ కారణమే. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో మొదటి సీజన్‌ను రక్తి కట్టించారు దర్శకద్వయం రాజ్-డీకే. అందులో వారు రాసుకున్న పాత్రలు వెబ్‌సిరీస్‌కు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ సందర్భంగా మొదటి సీజన్‌లో ప్రేక్షకులను అలరించిన పాత్రలను ఓ సారి పరిశీలిద్దాం..
శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పాయ్-Manoj Bajpai)
ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకున్న పోలీస్ అధికారిగా కనిపిస్తాడు శ్రీకాంత్ తివారి. అయితే గూఢచారిగా పనిచేసే విషయం అతని భార్యకు కూడా తెలియదు. ఇంట్లో భార్య పోరును సహిస్తూనే బయట ఉగ్రవాదుల మీద విరుచుకుపడుతుంటాడు. అలా కుటుంబం, ఉద్యోగం రెండు జీవితాలను సమతౌల్యం చేస్తూ మొదటి సీజన్‌ని రక్తి కట్టించాడు. రెండో సీజన్‌లోనూ అదిరిపోయే పంచ్‌లు, యాక్షన్ సీన్లతో అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
సుచిత్ర (ప్రియమణి-Priyamani)
శ్రీకాంత్ తివారి భార్య సుచిత్ర. ప్రియమణి ఈ పాత్రను పోషించారు. భర్త శ్రీకాంత్‌తో కలిసి ముంబయిలో నివాసముంటుంది. ఇద్దరు పిల్లలు. టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించట్లేదని భర్తపై కోపంగా ఉంటుంది. జీవితంలో ఎదగాలని కోరుకునే మహిళ సుచిత్ర. మధ్య వయస్సు సంక్షోభంతో సతమతమయ్యే స్త్రీగా ప్రియమణి చక్కగా నటించింది. రెండో సీజన్‌లో కథ చైన్నైకి మారింది. అది సుచిత్ర స్వస్థలం. అక్కడ కీలక మలుపులు ఉండే అవకాశం లేకపోలేదు. రెండో సీజన్‌లోనూ భర్త తివారీతో గొడవలు తగ్గలేదని ట్రైలర్‌లో స్పష్టం అవుతోంది.
జేకే తల్పడే (షరిబ్ హష్మీ-Sharib Hashmi)
శ్రీకాంత్ స్నేహితుడు జేకే తల్పడే. దాదాపు మొదటి సీజన్‌లో ఎక్కువ సన్నివేశాలు జేకే తల్పడే, శ్రీకాంత్ తివారీల మధ్యే ఉన్నాయి. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తారు. కలిసే ఉగ్రవాదులను ఎదుర్కొంటారు. యాక్షన్ ఘట్టాల్లో మనోజ్ బాజ్‌పాయ్‌తో పోటీపడీ నటించాడు షరిబ్ హష్మీ. రెండో సీజన్‌లోనూ ఈ స్నేహితుల జంట వినోదాన్ని పంచుతుంది అనడంలో సందేహం లేదు.
అరవింద్ (శరద్ కేల్కర్-Sharad Kelkar)
సుచిత్ర సహోద్యోగి. ఓ అంకుర పరిశ్రమను స్థాపించి కార్పోరేట్ ప్రపంచంలోకి దిగాలని ప్రణాళికలు వేస్తుంటాడు అరవింద్. ఇద్దరూ ఒకే దగ్గర పనిచేస్తూ ఉండటం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సుచిత్ర, అరవింద్ సన్నిహితంగా ఉంటున్నారని గొడవ కూడా చేస్తాడు శ్రీకాంత్. అంతంతమాత్రంగా ఉన్న వీరి బంధం ఈ మూడో వ్యక్తి రాకతో ఇంకా ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే రెండో సీజన్‌ను చూడాల్సిందే.
మూసా (నీరజ్ మాధవ్-Neeraj Madhav)
ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరిన కేరళ యువకుడు మూసా. ప్రతీకారంతో రగిలిపోయే ఉగ్రవాది. గాయాలతో శ్రీకాంత్ తివారీకి పట్టుబడతాడు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని మిషన్ జుల్ఫికర్ పేరుతో భోపాల్ గ్యాస్‌లాంటి ఉదంతాన్ని పునరావృతం చేయాలనుకుంటాడు. మొదటి సీజన్ చివర్లో జరిగిన గొడవలో సహ ఉగ్రవాది సాజిద్, మూసాను కాల్చి చంపుతాడు. ఈ పాత్రను మలయాళ నటుడు నీరజ్ మాధవ్ పోషించారు.
జోయా(శ్రేయ ధన్వంతరి-Shreya Dhanwanthary)
జోయా కూడా శ్రీకాంత్ టీంలోని సభ్యురాలే. ఉగ్రవాదులను హతం చేయడంలో ఆమెదీ చురుకైన పాత్రే. శ్రీకాంత్, తల్పడే, బాషాలతో కలిసి ఉగ్రవాదుల మీద తూటాల వర్షం కురిపిస్తుంది. అయితే చివరి ఎపిసోడ్‌లో జరిగే ప్రమాదంలో చిక్కుకుని చనిపోతుంది. ఈ పాత్రకు కూడా మొదటి సీజన్‌లోనే శుభం కార్డు పడింది.
సలోని (గుల్ పనాగ్-Gul Panag)
ఈ వెబ్ సిరీస్‌లో మరో ముఖ్యపాత్ర సలోని భట్. గుల్ పనాగ్ ఈ పాత్రను పోషించింది. శ్రీకాంత్ తివారీని ముంబయి నుంచి శ్రీనగర్‌కు బదిలీ చేశాక అక్కడే తారసపడుతుంది సలోని. ఆమె ఒకప్పుడు శ్రీకాంత్ మాజీ ప్రేయసి. అక్కడ ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
మేజర్ విక్రమ్ (సందీప్ కిషన్-Sundeep Kishan)
తెలుగు నటుడు సందీప్ కిషన్ మేజర్ విక్రమ్‌గా నటించాడు. చిన్నపాత్రే అయినా ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్‌కు సాజిద్ అనే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో మేజర్ విక్రమ్ మార్గనిర్దేశనం చేస్తాడు. ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. రెండో సీజన్‌లో పోలీసుల ఆపరేషన్ చైన్నైకి మారడం వల్ల మళ్లీ సందీప్ కిషన్ కనిపించే అవకాశాలు లేనట్లే.
ఇమ్రాన్ బాష (కిషోర్ కుమార్)
శ్రీకాంత్ టీంలో మరో సభ్యుడే ఇమ్రాన్‌బాష. దేశభక్తి మెండుగా ఉండే ముస్లిం పోలీసు. అయినప్పటికీ ఉగ్రవాదులపై పోరులో చురుకుగా పాల్గొంటాడు. ఈ పాత్రను దక్షిణ భారత నటుడు కిషోర్ కుమార్ చేశాడు. అయితే ఈ పాత్రకు మొదటి సీజన్ మధ్యలోనే తెరపడింది. మూసాపై అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోతాడు ఇమ్రాన్ బాష. యాక్షన్ ఘట్టాల్లో కిషోర్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది.
సీజన్ 2 లో మరికొందరు
రెండో సీజన్‌లో వీరితో పాటు మరికొందరు కొత్త నటీనటులు రాబోతున్నారు. సమంత అక్కినేని (Samantha Akkineni)నెగెటివ్ రోల్‌లో నటించింది. వీరితో పాటు దేవదర్శని, మైమ్ గోపి, అళగమ్ పెరుమాళ్, సీమా బిస్వాస్‌లాంటి మరికొందరు నటీనటులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">