హింసాత్మక, ద్వేషపూరిత సమాచారంతో పాటు, ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలను నిరోధించడంలో.. ప్రముఖ సామాజిక దిగ్గజం ఫేస్బుక్ విఫలమైందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు 'ఫ్రీజ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియన్, కేట్ పెర్రీ, లియోనార్డో డికాప్రియో తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్దాషియన్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు చేసింది. ఇటువంటి ప్లాట్‌ఫామ్‌లు అసత్య ప్రచారాలను ప్రోత్సహిస్తుంటే మౌనంగా ఉండలేనని స్పష్టం చేసింది. అమెరికాను విభజించేందుకు కొన్ని సమూహాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఈ ఉద్యమానికి లియోనార్డో కూడా మద్దతు తెలిపారు.
ఈ విషయంపై ఫేస్బుక్ స్పందించేందుకు నిరాకరించింది. అయితే, ఇటీవలే హింసను ప్రోత్సహించే గ్రూపులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసింది. నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో తమ జోక్యం ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు ఫేస్బుక్ అధినేత జుకెర్‌బర్గ్.