బాలీవుడ్ కథానాయిక, నిర్మాత అనుష్క శర్మపై భాజపా ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ ఇటీవల కేసు నమోదు చేశారు. అనుష్క నిర్మించిన వెబ్ సిరీస్ 'పాతాళ్‌లోక్' అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇందులోని ఓ సన్నివేశంలో నందకిశోర్ ఫొటోను తన అనుమతి లేకుండానే ఉపయోగించారని అనుష్కపై కేసు నమోదు చేశారు గుర్జర్.
అంతేకాదు వెబ్ సిరీస్‌ను నిషేధించమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ రాశారు గుర్జర్. అనుష్క మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కారణమయ్యారని ఆమెపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అనుష్క దేశద్రోహి అని ఆరోపించారు.
ఈ క్రమంలో నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రస్తావించారు. "విరాట్ కోహ్లీకి దేశభక్తి ఉంది. ఆయన భారత్ తరఫున ఆడుతున్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలి" అని అన్నారు. 'పాతాళ్ లోక్' సిరీస్‌పై ఇప్పటికే గోర్ఖా వర్గం వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ సన్నివేశంలో గోర్ఖా వర్గాన్ని కించపరిచే సంభాషణలున్నాయంటూ ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గోర్ఖా యూత్ అసోసియేషన్(ఆప్‌గ్యా) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంఘం శాఖాధ్యక్షుడు బికాష్ భట్టారై.. అనుష్కపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : 'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'