కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో దొరికిన ఈ విరామ సమయాన్ని సెలబ్రిటీలు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నటి భూమిక చావ్లా(Bhoomika Chawla) ఆధ్యాత్మికంగా మారడానికి ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం భూమిక.. దాదాపుగా మూడు నెలల నుంచి ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని తన ఫామ్‌హౌస్‌లో భర్తతో కలిసి ఉంటుంది. ఆమె భర్త యోగా టీచర్. ఆయన దగ్గర ఉంటూనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజు యోగా చేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా గంగానది ఒడ్డున సేద తీరుతూ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తోంది. చుట్టూ ప్రక్కల గ్రామస్థులతోనూ ముచ్చటిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలనూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటోంది.

భూమిక.. తెలుగులో 'యువకుడు' సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'బద్రి' సినిమాతో స్టార్ హీరోయిన్ మారిన ఆమె.. పలు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. 'ఎంసీఏ', 'యూ టర్న్', 'సవ్యసాచి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.



ఇదీ చూడండి: నవతరం 'మిస్సమ్మ' ఈ 'ఖుషీ' ముద్దుగుమ్మ