'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ చిత్ర విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో బోయపాటి-బాలయ్య కలయికలో వచ్చే కొత్త సినిమాను ఆరోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైనా .. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను వేసవి కల్లా పూర్తి చేసి జులై నెలలో విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఈ వార్తల్లో నిజం తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రకటించిన విడుదల తేదీపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ తేదీని తమ సినిమా విడుదలకు వాడుకుంటే కలిసొస్తుందని బోయపాటి ఆలోచన. ఒకవేళ ఇదే నిజమైతే.. జులై 30న యంగ్‌టైగర్‌ను తెరపై చూడలేకపోయినా.. నందమూరి నట సింహాన్ని తెరపై చూసుకునే భాగ్యం సినీప్రియులకు కలుగుతుంది. 'సింహా', 'లెజెండ్' హిట్ చిత్రాల తర్వాత బోయపాటి - బాలకృష్ణల కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి:- 'ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది'