AR Rahman songs: ఓ వర్షకాల సాయంత్రం. ఇంటి బాల్కనీలో లేదా బస్సు విండో సీట్లో కూర్చొని ఏం పాట విందాం? అనే ఆలోచించినప్పుడు మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఏఆర్ రెహమాన్. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన మెలోడీ పాటలు మనల్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి. ఆయన మ్యూజిక్ ఇచ్చిన కొన్ని గీతాలు దేశభక్తిని బయటకు తీస్తాయి. గురువారం(జనవరి 6) ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి విశేషాలు మీకోసం..
- అల్లా రఖా రెహమాన్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, సాంగ్ రైటర్
- ఈయన అసలు పేరు దిలీప్ కుమార్. 1989లో కుటుంబంతో సహా ఇస్లాం స్వీకరించిన తర్వాత తన పేరు మార్చుకున్నారు.
- తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలకు సంగీతమందించి, స్టార్ హోదా సంపాదించారు.
- మణిరత్నం 'రోజా'తో కెరీర్ ప్రారంభించిన రెహమాన్.. తొలి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
- 1967 జనవరి 6న రెహమాన్ చెన్నైలో పుట్టారు. ఆయన తండ్రి ఆర్.కె.శేఖర్ కూడా కంపోజరే.
- తమిళ, మలయాళ సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చేవారు. తండ్రి దగ్గర రెహమాన్.. కీబోర్డు ప్లే చేయడం నేర్చుకున్నారు.
- రెహమాన్‌కు తొమ్మిదేళ్ల వయసులో తండ్రి మరణించారు. దీంతో ఇంట్లో సంగీత పరికరాలు అద్దెకిచ్చి కొన్నాళ్లపాటు జీవనం సాగించారు.
- చిన్నప్పటి స్నేహితులు శివమణి, జాన్ అంటోనీ, సురేశ్ పీటర్స్, జోజో, రాజాలతో కలిసి రెహమాన్.. 'రూట్స్' అనే రాక్‌బ్యాండ్ కూడా పెట్టారు. నెమెసిస్ అవెన్యూ అనే రాక్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు.
- వందేళ్లకు పైగా భారతీయ చిత్రపరిశ్రమకు కలగానే ఉన్న అకాడమీ అవార్డును తన పాటతో అందించారు రెహమాన్.
- Oscar award AR Rahman: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాలోని 'జయహో' పాటకు రెండు ఆస్కార్లు వరించాయి.
- స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా 'వందేమాతరం'కు అతడిచ్చిన ట్యూన్.. దేశానికి గొప్ప మ్యూజికల్ గిఫ్ట్.
- కేంద్రప్రభుత్వం రెహమాన్‌ను.. 'పద్మశ్రీ','పద్మ భూషణ్' లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతోనూ సత్కరించింది.
- తెలుగులో పల్నాటి పౌరుషం, నాని, సూపర్ పోలీస్, ఏ మాయ చేసావె, కొమరం పులి సినిమాలకు రెహమాన్ సంగీతమందించారు.